
సాహిత్యం, కళలు సమాజానికి ఉత్కృష్టమైన ఆలోచనలు కలిగించే అంశాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కొచ్చిలో జరిగిన తపస్య కళా సాహిత్య వేదిక స్వర్ణోత్సవ వేడుకలను మోహన్ భాగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా తపస్య సంస్థ పనిచేస్తోందని, కేవళం కళలు, సాహిత్య రంగాలకు మాత్రమే కాకుండా సమాజంలోని అన్ని రంగాలకూ సంబంధించిన సంస్థ అని పేర్కొన్నారు.సత్యం, దయ, పవిత్రత అనేవి ధర్మానికి పునాదులని వివరించారు.
భారత్ తత్వశాస్త్రం మూలాధారమైనదన్నారు. సమాజం విజయవంతం కావాలన్నా, అర్థవంతమైనదిగా మారాలన్నా దానికి మూలం ధర్మమేనని, ఈ సూత్రాల ఆధారంగా సామాజిక జీవితాలను పునర్నిర్మించే బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తిలో కూడా ఈ లక్షణాలను పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. అలాగే వసుధైవ కుటుంబం అన్న సారాంశం భారత్ దేశ గొప్ప సంప్రదాయమని, కళలు, సాహిత్యం ద్వారా జాతి యావత్ ప్రపంచానికే నమూనాగా నిలుచుందన్నారు.
ఈ సందర్భంగా ‘‘మానిషాద ప్రతిష్ఠితాం’’ అన్న శ్లోకాన్ని ఉటంకించారు. వేటగాడి బాణం తగిలిన క్రౌంచపక్షి జంటను చూసినప్పుడు మహర్ష వాల్మీకి హృదయంలో వెల్లువెత్తిన దుఖం, బాధ నుంచే మానిషాద అన్న శ్లోకం వచ్చిందని వివరించారు.
ప్రపంచం మొత్తం కూడా ఎన్నో ఆశలతో భారత్ వైపు చూస్తోందని, ఆ ఆశలను నెరవేర్చుకోవాలని మోహన్ భాగవత్ సూచించారు. అలాగే ఆ లక్ష్య సాధనలో కళలు, సాహిత్యం అన్న మాధ్యమంగా ఆ ఆశలను తపస్య సంస్థ నెరవేర్చాలని ఆకాంక్షించారు. తపస్య చేస్తున్న పనులను సంస్కార భారతి కూడా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు.




