
(ఆగస్టు 11- తులసీదాసు జయంతి)
కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్లీ ప్రజ్వరిల్లేట్లు చేసిన మహా భక్తుడు. అఖాడాల స్థాపన ద్వారా యువతలో పోరాట పటిమను రేకెత్తించాడు. ఆయనే హిందూ ఆధ్యాత్మిక గురువు తులసీదాసు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని ఏడవ రోజున తులసీదాసు జయంతిని నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం తులసీదాస్ జయంతిని ఆగస్టు 11న జరుపుకుంటున్నాము. తులసీదాస్ గొప్ప కవి. రామచరిత మానస్‌ను సృష్టించిన ఘనత ఆయనది. మహాకవి తులసీదాస్ తన జీవితమంతా రామ భక్తుడిగానే గడిపాడు. తులసీదాసు తండ్రి ఆత్మారాముడు, తల్లి హులసీ. తులసీదాసు జన్మించినప్పుడు ఆయన 5 సంవత్సరాల బాలుడిలా కనిపించాడట. తల్లితండ్రులు అతని విలక్షణ రూపానికి భయపడి తమ ఇంటి దాసి మునియాకు పెంచుకోవడానికి ఇచ్చారు. తరువాత కొద్దికాలానికి ఆతనిని పెంచుకొన్న మునియా దాసి కూడా చనిపోయింది. అపుడు బాబా నరహరిదాసు అనే సాధువు ఆ అనాథ బాలుడైన తులసీదాసుని పెంచి విద్య నేర్పారు. తరువాత శేష సనాతనుడనే శ్రేష్ఠుని దగ్గర తులసీదాసు వేద, వేదాంగాలు అభ్యసించాడు. తులసీదాసు అనాథ బాలుడైనా ఆతని రూప, గుణ, శీల, స్వభావ, విద్వత్తులకు ముగ్ధుడైన ఒక కులీన బ్రాహ్మణుడు తన కూతురునిచ్చి వివాహం చేశాడు. ఆమే రత్నావళి. తులసీదాసుకు తన భార్య రత్నావళి అంటే ఎంతో ప్రేమ.
ఒకసారి తులసీదాసు ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య రత్నావళి పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు చిమ్మ చీకటిలో, జోరువానలో గంగానదిని దాటాడు. అలా తన వద్దకు వచ్చిన తులసీదాసుతో, ‘‘నాధా! ఎముకలు, చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ శ్రీరాముని మీద ఉంటే భవభీతియే ఉండదుకదా,’’ అని రత్నావళి పలికింది. ఈ మాటలే తులసీదాసుకు తారకమంత్రాలయ్యాయి. అలా భార్య మాటలతో పరివర్తన చెందిన తులసీదాసు విరాగిగా మారి శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడయ్యాడు. కాశీ, అయోధ్య ఈ రెండు ఆయనకు నివాస స్థానాలు అయ్యాయి. లోకకల్యాణకరమైన రామచరితమానస్ మహాకావ్యాన్ని తులసీదాసు అయోధ్యలో ప్రారంభించి కాశీలో పూర్తి చేశాడు.
తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు. భక్తిభావం, కావ్య రచన, తాదాత్మ్యత, భాష చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. తులసీదాసు తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్, రామలాల నహచాచు, రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్, కృష్ణ గీతావళి, హుమాన్ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్ చాలీసా వంటివి ఉన్నాయి. అయితే రామచరితమానస్ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది.
తులసీదాసు కేవలం రచనలకే పరిమితం కాలేదు. కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్లీ ప్రజ్వరిల్లేట్లు చేసిన మహాభక్తుడు. ఆయన ఉత్తర భారతదేశమంతా పర్యటించి అఖాడాల స్థాపన ద్వారా యువతలో పోరటా పటిమను రేకెత్తించాడు. తులసీదాసు ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలు స్థాపించారు. వారణాసిలోని సంకటమోచన్ దేవాలయాన్ని ఆయన కట్టించాడు. తనకు రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా సంకటమోచన్ ఆలయాన్ని కట్టించాడని ప్రతీతి. తులసీదాసు విరిచిత హనుమాన్ చాలీసా జగత్ప్రసిద్ధి చెందిన సాధనామంత్రం. తులసీదాసు దేశభక్తి పరాయణుడు. మహారాణా ప్రతాప్‌కు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూనే, దేశ రక్షణ, ధర్మ రక్షణ దిశగా ప్రేరేపించి లోకానికి గొప్ప వీరుడిని అందించారు. ఇటువంటి మహనీయుడిని మనం నిత్యం స్మరించాలి. వీరి జీవితం నుంచి ప్రేరణ పొందాలి.




