News

గ్లోబల్‌ వార్మింగ్‌తో భూభ్రమణంలో హెచ్చుతగ్గులు.. 2029లో సమయాన్ని మార్చాల్సిందేనా?

302views

గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం సమయంపైన కూడా పడుతున్నదని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ధ్రువపు మంచు కరుగుతున్నదని, దీని వల్ల భూమి తిరిగే వేగంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయని గుర్తించారు. దీని ప్రభావం సమయాన్ని లెక్కించడంపై పడుతున్నట్టు చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌ డియాగోలోని స్క్రిప్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియానోగ్రఫీకి చెందిన పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం వివరాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

వాతావరణ మార్పుల వల్ల అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌ లాంటి ప్రాంతాల్లో వేగంగా మంచు కరిగి, ఆ నీళ్లు భూమధ్య రేఖ వైపుగా ప్రవహిస్తున్నట్టు చెప్పారు. ఫలితంగా భూమి తిరిగే వేగంలో మార్పులు చోటుకుచేసుకుంటున్నట్టు చెప్పారు. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగితే ఒక రోజు అవుతుందనే లెక్కలో ప్రతిరోజూ కొన్ని మిల్లీ సెకన్ల తేడా వస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి, సమయాన్ని, భూమి తిరిగే వేగానికి సరిపోయేలా మార్చడానికి గానూ 2029లో కోఆర్డినేటెడ్‌ యూనివర్సల్‌ టైమ్‌(యూటీసీ) నుంచి ఒక సెకనను తగ్గించాలని సూచించారు. దీనినే ‘నెగెటివ్‌ లీప్‌ సెకండ్‌’ అంటారు. దీని ప్రభావం స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వ్యవస్థపై పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.