
ఓ వైపు సువిశాల సాగరతీరం.. మరోవైపు మది దోచే పచ్చని గిరులు.. అణువణువునా అద్భుత సోయగం.. మనసును సేద తీర్చే ఆహ్లాదకర వాతావరణం.. కలబోసిన ఆధ్యాత్మిక నిలయం
విశాఖపట్నం రుషికొండలోని శ్రీవారి ఆలయం. సాక్షాత్తు తిరుమల వైకుంఠనాథుడే కొలువయ్యారా అన్నట్లుగా దర్శనమిచ్చే స్వామి రూపం మది నిండా మధురానుభూతిని పంచడంతో భక్తకోటి స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. రుషికొండ తీరంలోని ఉత్తరాంధ్ర వైకుంఠధామంగా అలరారుతున్న శ్రీ మహాలక్ష్మి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవానికి ముస్తాబవుతోంది.
కొమ్మాదిలో శ్రీ వారి ఆలయం అణువణువు ఓ అద్భుతమే. సాగర తీరానికి అభిముఖంగా ఉత్తరాంధ్ర వైకుంఠధామంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పది ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. 1.5 ఎకరాల్లో ప్రధాన ఆలయ నిర్మాణం జరిగింది. కొండపైకి రోడ్డు మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆర్చి నుంచి లోపలికి అడుగిడగానే ఘాట్‌రోడ్డుకు ఇరువైపులా పూల మొక్కలు, శ్రీవారి నామాలు, పూలకుండీలు స్వాగతిస్తాయి. ఇక ప్రధాన ఆలయం ఆధ్యాత్మిక శోభతో, శిల్పకళానైపుణ్యంతో చూపు మరల్చనీయదు. తిరుమలలో శిల్ప కళాకారులు రూపొందించిన శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి, శ్రీవారి పాదాలు, భూదేవి విగ్రహాలు భక్తి భావనను ఇనుమడింపజేస్తాయి.
ప్రత్యేక పూజలు
శ్రీవారి ఆలయంలో సాధారణ రోజుల్లో పూజలతో పాటు ప్రత్యేక దినాల్లో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతీ నెల శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్నపన తిరుమంజనం, ప్రతీ శుక్రవారం వారాభిషేకంలో భాగంగా శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ, భోగి నాడు గోదాదేవి కల్యాణం జరిపిస్తున్నారు. ఏటా మూడు పర్యాయాలు వైకుంఠ ఏకాదశి, ఉగాది, బ్రహ్మోత్సవాల ముందు మంగళవారం నాడు కోయల్ ఆల్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతీ శనివారం పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే కోలాటాలు, శ్రీవారి నామ సంకీర్తన తదితర కార్యక్రమాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంటాయి. రాష్ట్రం నలుమూలల నుండి అనేక మంది మహిళలు పెద్ద ఎత్తున శ్రీవారి సేవ చేసేందుకు వస్తుంటారు.
శ్రీవారి ఆలయాన్ని చేరుకునే మార్గం
శ్రీవారి ఆలయానికి జిల్లా నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఆలయానికి చేరుకునేందుకు కొండపైకి ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆటోలకు అనుమతి లేదు. కొండ చిన్నది కావడంతో భక్తులు నడిచి ఆలయాన్ని చేరుకోవచ్చు. కొండ దిగువ నుంచి కొండపై శ్రీవారిని చేరుకునేందుకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది. రాత్రి 7.30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్నారు.
వార్షికోత్సవానికి సన్నాహాలు
ఈ నెల 30వ తేదిన శ్రీవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా కోయల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయానికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏఈవో జగన్ మోహనాచార్యులు తెలిపారు.




