
మూడవ శతాబ్దంలో నాగార్జున కొండ కేంద్రంగా విజయపురి రాజధానిగా కృష్ణానదీ తీరాన్ని పరిపాలించిన ఇక్ష్వాకుల కాలం నాటి ప్రాచీన బౌద్ధ శిలా శాసనం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామంలో పునర్నిర్మించిన పోతురాజు స్వామి దేవాలయంలో ప్రతిష్ట కానుంది. పురిటిగడ్డ గ్రామంలోని ప్రాచీన శ్రీ గంగానమ్మ పోతురాజు స్వామి వార్ల దేవాలయ పునర్నిర్మాణ క్రమంలో ఆలయంలోని పోతురాజు శిలను శుభ్రం చేయటంతో పోతురాజు శిల ప్రాచీన వైభవం వెలుగు చూసింది. ఈనెల 30న నూతన ఆలయంలో పోతురాజు, గంగానమ్మల విగ్రహాల పునః ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది.
చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం
పురిటిగడ్డలో పోతురాజు రూపంలో ఉన్న మూడవ శతాబ్దం నాటి ఇక్ష్వాకుల నాటి బౌద్ధ శిలా శాసనం ఈ ప్రాంత ప్రాచీన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ పోతురాజు శిలకు ఒక వైపు మూడవ శతాబ్దం నాటి బ్రాహ్మీ లిపిలో, ప్రాకృత భాషలో ఆనంద అనే బౌద్ధ గురువు శ్లాబు వేసేందుకు విరాళం ఇచ్చి నట్లు చెక్కి ఉన్న ట్లు బెంగళూరు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాసన విభాగం డైరెక్టర్ మునిరత్నం నాయుడు ప్రకటించారు. విగ్రహానికి మరోవైపు తల్లి, చేతిలో ఒక బిడ్డ, చంకలో ఒక బిడ్డతో కనిపిస్తుంది. గంగానమ్మ ముందు పోతురాజు వీరంగమాడుతున్నట్లు ఈ విగ్రహం చెక్కారు. పోతురాజు పైన ఉన్న సూర్య, చంద్రులు, కోడిపుంజు బొమ్మలు మాత్రం 3వ శతాబ్దం నాటి రూపాలని గుర్తించారు. ఈ శిలపై 19వ శతాబ్దంలో పోతురాజు శిల చెక్కినట్లు గుర్తించారు.
దాతల సహకారంతో నిర్మాణం
జీర్ణావస్థకు చేరిన పోతురాజు, గంగానమ్మల ఆలయం పునర్నిర్మాణం దాతల సహకారంతో పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ పెద్దలు నాదెళ్ల శివరామకృష్ణ తెలిపారు. ఆలయంలోని పాలరాతి పోతురాజు శిల ప్రాచీనత గుర్తించి పురిటిగడ్డ జెడ్పీ హైస్కూల్ ప్లస్ అధ్యాపకురాలు ఓలేటి ఉమా సరస్వతి చొరవతో పురావస్తు శాఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సహకారంతో పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం నాయుడు ఈ శిలాశాసనం ప్రాచీన వైభవాన్ని వెలుగులోకి తెచ్చారని తెలిపారు. ఇంత గొప్ప ప్రాచీన శిలా శాసన సహిత పోతురాజు శిల తమ గ్రామంలో ఉండటం గర్వకారణం అన్నారు. శనివారం జరిగే ఆలయ ప్రతిష్టా మహోత్సవాన్ని భక్తులు విజయవంతం చేయాలని కోరారు.



