News

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి శోభ

212views

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సూర్యుని పుట్టిన రోజైన ఈ రధసప్తమి నాడు అరసవల్లి సూర్యదేవునికి విశేష పూజలు జరిగాయి. ముందుగా విశాఖ శ్రీ శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి శిష్య పరంపర స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవానికి అంకురార్పణ చేశారు.వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సూర్యజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం పన్నెండు గంటల అయిదు నిమిషాల నుండి క్షీరాభిషేకం ప్రారంభం అయింది. పాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలుతో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి.ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఇప్పిలి నగేష్‌శర్మ నిర్వహణలో అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళధ్వనుల నడుమ క్షీరాభిషేకాన్ని కన్నుల పండువగా జరిపించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.ఉదయం అయిదు గంటల నుండి భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం ప్రారంభం అయింది. దేశం నలుమూలల నుండి తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నిజరూప దర్శనం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. రధసప్తమి, సూర్యజయంతి సందర్భంగా స్వామి వారికి విశేష పుష్పమాల అలంకరణ సేవ, విశేష అర్చన, నీరాజనం వంటి పూజలను నిర్వహించారు.

స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. లక్షలాది మంది భక్తులు అరసవల్లి సూర్యభగవానుడి నిజరూప దర్శనం చూసి పులకించిపోయారు.. ఏడాది ఒక్కసారి మాత్రమే సూర్య జయంతి నాడు ఈ మహా దర్శనం లభించనుండటంతో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీకాకుళం నగర వీధులన్నీ జనసంచారంతో కనిపించాయి.