
జాతీయస్థాయిలో సంపాదకులుగా వెలుగొందిన ఆంధ్రులలో అగ్రగణ్యులు సి.వై. చింతామణి. సంపాదకీయాల సాహసి, స్థానబలం లేకున్నా ప్రముఖులను ఢీకొనే మనస్తత్వం వున్న జర్నలిస్టు చింతామణి. ఈ తరం వారికి అంతగా ఆయనగురించి తెలియదు. కాని ఈ కలం వీరుడు 8 దశాబ్దాల క్రితమే ఉత్తరాదికి చేరి స్వతంత్య్ర పోరాటంలో కీలక కేంద్రమైన ప్రయాగ (అలహాబాద్) నుండి అద్భుతమైన సంపాదక ప్రయోగాలు చేశాడు. చింతామణి జాతీయవాది. జాతీయభావాలను పత్రికల్లో ప్రచురించేవాడు. కాని అవి కొరడా తీసి కొట్టినట్లుగా కాక సుతిమెత్తగా వాతలు పెట్టినట్లుగా వుండేవి. బ్రిటీష్ పాలకులు కూడా ఆయన సంపాదకీయాలను మెచ్చుకునేవారు. చింతామణి చేసిన సంపాదక సూచనలకు విలువనిచ్చేవారు. ప్రయాగ వాతావరణం చింతామణి రాకతో మారిపోయింది. స్థబ్దతగా ఉన్న ప్రయాగలోని ప్రజలను తట్టిలేపాడు. అటువంటి సాహసి. ప్రజలను కదిలించే వ్యక్తి కోసం ప్రయాగ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నది. తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తీకరించటమే కాక ఇతరులను ఆ బాటలోకి తీసుకువెళ్ళినవాడు చింతామణి” అని సర్ తేజ్ బహదూర్ సప్రూ చేత కొనియాడబడ్డాడు.
విజయనగరం ఆస్థానంలో ఆధ్యాత్మిక సలహాదారు అయిన చిర్రావూరి రామసోమయాజుల పుత్రుడైన యజ్ఞేశ్వర చింతామణి తన 18వ ఏటనే ‘వైజాగ్ స్పెక్టేటర్’ అనే పత్రికకు సంపాదకుడయ్యాడు. తెలుగు పత్రికలకే ఆదరణ తక్కువగా ఉన్న కాలంలో కేవలం చింతామణి కలం బలంతో ఆంగ్లపత్రికను చదివేలా చేశాడు. మద్రాసులో కొంతకాలం పనిచేసిన చింతామణి కలానికున్న విశిష్టతను గుర్తించిన మదన్ మోహన్ మాలవ్య తాను స్థాపించిన ‘లీడర్’ పత్రికకు సంపాదకుడిగా చింతామణిని ఆహ్వానించాడు. ఆవిధంగా అలహాబాద్ చేరిన సి.వై.చింతామణి ఇక పూర్తిగా ఉత్తర భారతదేశపు మనిషి అయ్యాడు.లీడర్’ పత్రికలో వాడే ప్రతి అక్షరంకి బాధ్యుడిని నేను. మరెవరూ వ్రేలు పెట్టేందుకు ఒప్పుకోను అని స్పష్టంచేశాడు తొలిరోజునే. ఆ తర్వాత చైర్మన్‌గా వచ్చిన మోతీలాల్ నెహ్రూ సంపాదక అంశాలలో వ్రేలు పెట్టబోనే కూడదని చెప్పటమే కాదు, పత్రికలో నువ్వో నేనో ఒకరమే వుండాలి. నన్ను కాదంటే ఈ క్షణంలో వెళ్ళి పోతా అన్న వై.సి. చింతామణి ధైర్యం చూసిన మోతీలాల్ నెహ్రూ తప్పుకుని తన గౌరవం నిలుపుకున్నాడు.
1909 నుండి 1934 వరకు లీడర్ పత్రిక ద్వారా స్వాతంత్ర్య పోరాటానికి అనుకూల వాతావరణం సృష్టించాడు. 1927 నుండి 1936 వరకు ఉత్తరప్రదేశ్ శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనాయకుడుగా ఉన్నాడు. సంపాదక బాధ్యతలు నిర్వహిస్తూనే, రాజకీయ పదవికి ఎటువంటి అభ్యంతరం లేని మినహాయింపు నాటి పాలకులు సి.వై.చింతామణికి యిచ్చి తమ గౌరవం ప్రదర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లో నాడు బ్రిటీష్ వారు అనుమతించిన ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసాడు చింతామణి. 1930-31లో లండన్లో జరిగిన తొలి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కి ప్రతినిధిగా వెళ్ళాడు. సి.వై.చింతామణి సంపాదకీయాల అభిమానులుగా మహాత్మాగాంధీతో పాటుగా బ్రిటీష్ అధికారులు వుండేవారు. ఆయనలోని నిష్పక్షపాత వ్యవహార ధోరణికి నిదర్శనం సంపాదకీయాలు.
“జర్నలిజాన్ని మతంగా తీసుకుని ఆచరించే వారందరికీ గురువు (పోప్) సి.వై వేటు చింతామణి” అన్నది శ్రీనివాసశాస్త్రి యిచ్చిన కితాబు.
‘రీ ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫెన్స్’ కి బ్రిటీష్ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక మీద సి.వై.చింతామణి సంపాదకీయం చదివిన ఇంగ్లండ్ పార్లమెంట్ సభ్యులు కమిటీ నివేదిక బదులు చింతామణి సంపాదక అంశాలు అమలు చేయటం మంచి అన్నారంటే ఆయన ఆలోచనలు ఎంత గొప్పవో అర్ధమవుతుంది.
దేశానికి అవసరమైనవి బ్రిటీష్ పాలకులచేత చేయించిన నేర్పరి సి.వై.చింతామణి.




