
శ్రీకాకుళం జిల్లాలోని ప్రత్యక్ష దైవం, ఉషాపద్మినీ ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి జయంత్యుత్సవం గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అరసవల్లి ఆలయంలో మహాక్షీరాభిషేకం పూజలు చేయనున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, ధూప, దీప నైవేద్యాలతో వైదిక సంప్రదాయంలో మూలవిరాట్టుకు క్షీరాభిషేకం, అర్చనలు జరగనున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆదిత్యునికి 12.30 గంటలకు సుప్రభాత సేవ, ఉషఃకాలార్చన, మహాక్షీరాభిషేకంతో సూర్యజయంతి వేడుకలు ప్రారంభమవుతాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల కుటుంబీకులు ఇప్పిలి జోగి సన్యాసిరావు ఆదిత్యుని ప్రథమార్చన పూజలు, మహాక్షీరాభిషేకం సేవలో పాల్గొంటారు. ఆలయ ఈవో రమేష్, ధర్మకర్తల మండలి సభ్యులు స్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాజమహేంద్రవరానికి చెందిన దేవాదాయ శాఖ ప్రాంతీయ సంచాలకుడు ఎం.విజయరాజు ఉత్సవ అధికారిగా నియమితులయ్యారు.




