
శ్రీ దుర్గామల్లే శ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల ఏడో తేదీ వరకు కొనసాగే దీక్షల విరమణకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఒడిశా నుంచి భవానీ మాలధారులు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. ఈ ఏడాది సుమారు ఐదు లక్షల మందికి పైగా భవానీలు దీక్షల విరమణకు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శ నంలో వారికి ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు ఆలయ ప్రాంగణంతో పాటు స్నాన ఘాట్లు, తలనీలాలు సమ ర్పించే కేశఖండన శాలలు, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, అన్న ప్రసాద వితరణ కేంద్రాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచే భవానీలు నగరానికి తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రోజు రాత్రే పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచ రించి, తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ పూర్తిచేసుకున్న అనంతరం క్యూలైన్‌లోకి చేరుకుంటారు.
అగ్నిప్రతిష్టాపనతో దీక్షల విరమణ ప్రారంభం
మూడో తేదీ ఉదయం ఆరు గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌కు ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం ఆలయం నుంచి అర్చకులతోపాటు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ కె.ఎస్.రామారావు, పాలక మండలి సభ్యులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహా మండపం దిగువన ఉన్న హోమగుండాల వద్దకు చేరుకుంటారు. మహా మండపం ఎదుట ఏర్పాటు చేసిన రెండు హోమ గుండాల్లో ఉదయం 6.30 గంటలకు అగ్నిప్రతిష్టాపన చేస్తారు. దీంతో దీక్షల విరమణ లాంఛనంగా ప్రారంభమవుతుంది. అప్పటికే అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని కొండ దిగువకు చేరుకునే భవానీలు ఇరుముడులను సమర్పించిన అనంతరం హోమ గుండంలో నేతి కొబ్బరికాయలను సమర్పించడంతో దీక్ష పరిసమాప్తం చేసుకుంటారు.
శబరిమల రద్దీ నేపథ్యంలో మరింత అప్రమత్తం
ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని రీతిలో శబరిమల అయ్యప్ప సన్నిధిలో స్వాముల రద్దీ అధికంగా కనిపించింది. శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 నుంచి 16 గంటల సమయం పట్టేలా రద్దీ కొనసాగుతోంది. దీంతో భవానీ దీక్షలు కూడా భక్తులు అధికంగానే స్వీకరించి ఉంటారని దేవస్థానం అంచనా వేస్తోంది. భవానీల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని దేవస్థాన చైర్మన్, ఈఓ పాలక మండలి సమావేశంలో చర్చించారు. పోలీసు శాఖ, రెవెన్యూ శాఖలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్‌తో పాటు పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాల వద్ద రద్దీని అంచనా వేయడంతో పాటు స్నానఘాట్లు, గిరి ప్రదక్షిణ మార్గాలు, క్యూలైన్‌లపై దృష్టి పెడుతున్నారు.
ఈ నెల 3వ తేదీ ఉదయం అగ్నిప్రతిష్టాపన 5 లక్షల మంది భవానీలు విచ్చేస్తారని అంచనా 20 లక్షల లడ్డూలనుసిద్ధం చేస్తున్న దేవస్థానం గిరి ప్రదక్షిణ మార్గంలో మరిన్ని సదుపాయాలు
కోవిడ్ నిబంధనలు తప్పని సరి…!
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో భవానీలు కోవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని దేవస్థానం సూచిస్తోంది. భవానీలు తమ స్వస్థలాల నుంచి బయలుదేరినప్పటి నుంచి మాస్క్‌లు ధరించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొంటోంది. దీక్షల విరమణకు నిత్యం వేలాది మంది భవానీలు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎవరికి వారు తమ స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.





