
ఆశీల్‌మెట్ట వద్ద ఉన్న సంపత్ వినాయగర్ ఆలయానికి ఈవోను నియమించాల్సిన దేవాదాయశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. రూ.కోట్ల ఆదాయం వచ్చే ఆలయ నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించడాన్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కేరళకు చెందిన ఓ కుటుంబం గతంలో ఇక్కడ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేసేది. కాలక్రమేణ ప్రాచుర్యం పెరగడంతో ఆదాయం కూడా అలాగే వృద్ధి చెందింది. ఈ క్రమంలో గతంలోనే ఆలయాన్ని దేవాదాయశాఖ తమ పరిధిలోకి తీసుకుంది. ఆ తర్వాత ఆలయ వ్యవస్థాపకులు అప్పటి ప్రభుత్వ పెద్దలను కలిసి నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించాలని కోరడంతో మినహాయింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ దేవాదాయశాఖే పాలన చేపట్టింది. 2018లో మళ్లీ అయిదేళ్లకు ఆలయ వ్యవస్థాపకులు దేవాదాయశాఖ నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు. అయినా…రెండేళ్ల కిందట అప్పటి సహాయ కమిషనర్ ఇన్‌ఛార్జి ఈవో బాధ్యతలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. అనంతరం నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. ఆలయంలో జోక్యం చేసుకోవద్దని సంబంధిత శాఖ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
మరో వైపు అయిదేళ్ల మినహాయింపు గత నవంబరుతో ముగిసింది. ఆ తరువాత దేవాదాయశాఖ సహాయ కమిషనర్ అమరావతికి లేఖ రాశారు. అది జరిగి రోజులు గడిచినా ఎటువంటి సమాచారం ఇక్కడికి రాలేదు. ప్రస్తుతానికి వ్యవస్థాపకులే నిర్వహించుకుంటున్నారు. భక్తుల దర్శనాల విషయంలో సామాన్య, ధనిక భేదాలు చూపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో దేవాదాయశాఖ మళ్లీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైస్థాయి నుంచి ఒత్తిళ్లు ఉండడంతోనే ఈవో నియామకంలో తాత్సారం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
పలుమార్లు మినహాయింపు తెచ్చుకున్న వ్యవస్థాపకులు మళ్లీ ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అందుకు తగ్గ ఉత్తర్వుల కోసం సంబంధిత శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అధికార పార్టీ నేతల ద్వారా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.





