
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పూర్ జిల్లాలో 310 మంది క్రైస్తవులు ఆ మతానికి స్వస్తి చెప్పి తిరిగి స్వధర్మాన్ని స్వీకరించారు. తద్వారా సనాతన హిందూ ధార్మికంలోకి తిరిగి ప్రవేశించారు. వీరంతా సర్సర గ్రామానికి చెందినవారు. హిందూ మతంలోకి తిరిగి రావాలనుకునే వ్యక్తుల కోసం ఘర్ వాపసీ కార్యక్రమాన్ని హిందూ సమాజం చేపడుతోంది. ఇందులో భాగంగా బర్సాతి బ్లాక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్ని 36 కుటుంబాలకు చెందిన 310 మంది ఒకేసారి హిందూ మతాన్ని స్వీకరించారు.
సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చిన 36 కుటుంబాలు
ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా హిందూ మతంలోకి ప్రవేశించాలనుకుంటున్న వారి కోసం వైదిక ఆచారాలతో పూజలు నిర్వహించి అనంతరం శుద్ధి యాగం జరిపించారు. ఇందులో భాగంగా స్వధర్మంలోకి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరూ యజ్ఞకుండ్‌లో నైవేద్యాలు సమర్పించారు. ఈ క్రతువులో దాదాపు 500 మంది పాల్గొన్నారు.
పదేళ్ల క్రితం క్రైస్తవ మతంలోకి
నూతనంగా స్వధర్మంలోకి వచ్చిన బర్సాతి ప్రాంతానికి చెందిన 36 కుటుంబాలు 10 ఏళ్ల క్రితం క్రైస్తవం స్వీకరించారు. అయితే తప్పు చేశామనే భావన వాళ్లను గత కొన్నేళ్లుగా వెంటాడుతోంది. ఈ క్రమంలో సనాతనధర్మానికి తిరిగి రావాలని వారు ఎదురు చూస్తున్నారు. ఘర్ వాపసీ కార్యక్రమం వారి ఆకాంక్షను నెరవేర్చింది. హిందూ సంస్థల వల్లే తాము స్వధర్మంలోకి రాగలిగామని శుద్ధి కాబడిన వారు తెలిపారు.
స్వధర్మంలోకి వచ్చిన వీరికి హనుమాన్ చాలీసా, గంగాజల్‌ను అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జౌన్‌పూర్ జిల్లా అధ్యక్షులు పాల్గొని ఘర్ వాపసీ కార్యక్రమం ముఖ్యోద్దేశం, హిందూమతం విశిష్టతను తెలిపారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకొని పలువురు అన్యమత ప్రచారకులు మత మార్పిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే మతం మారినవారు తమ తప్పు తెలుసుకోవడంతో తిరిగి స్వధర్మాన్ని స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారని సనాతన హిందూ ధర్మంలోని ఆధ్యాత్మిక, ఉదారవాద విలువలే అందుకు కారణం అన్నారు.



