
అయోధ్యలో సరయూ నది ఒడ్డున దాదాపు 2.8 ఎకరాల్లో నిర్మించిన అంతర్జాతీయ రామ్ కథా మ్యూజియం నిర్వహణను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించనుంది.ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఉభయులు సంతకాలు చేశారు.
అయోధ్యలోని అంతర్జాతీయ రామ్ కథా మ్యూజియం అయోధ్యను సందర్శించే పర్యాటకులకు ముఖ్యమైన ప్రదేశం.శ్రీరామునికి సంబంధించిన 1000 కంటే ఎక్కువ పురాతన, అరుదైన వస్తువులు ఈ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి.1992లో రామమందిర నిర్మాణ సమయంలో జరిపిన త్రవ్వకాలలో లభించిన శ్రీరామునికి సంబంధించిన శాసనాలు.. వీటితో పాటు, భారత్, విదేశాలకు చెందిన శ్రీరామునికి సంబందించిన ఆభరణాలు కూడా ఇక్కడి మ్యూజియంలో ఉండటం విశేషం. ఆలయాన్ని చదును చేసే సమయంలో పురావస్తు శాఖ సర్వే సమయంలో లభించిన వస్తువులు కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
రామ మందిర త్రవ్వకాల లభించిన అనేక ముఖ్యమైన అవశేషాలతో పాటు.. గుమ్నామీ బాబాకు సంబంధించిన అనేక వస్తువులను కూడా మ్యూజియంలో ఉంచారు. ఇక్కడ సుమారు 1000 పైగా పుస్తకాల సేకరణ, ఆర్ట్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచం నలుమూలల నుండి శ్రీరామునికి సంబంధించిన అనేక ముఖ్యమైన వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. గతంలో ఈ మ్యూజియంను అయోధ్యలోని తులసి స్మారక భవనంలో నిర్వహించగా.. అనంతరం సరయూ నది ఒడ్డున సుమారు రూ.13 కోట్లతో నిర్మించిన ప్రత్యేక భవనానికి మార్చారు.
ఎంఓయూ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్, శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు అనూప్ కుమార్ మిట్టల్, ముఖ్య కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మెష్రామ్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శిశిర్, ప్రత్యేక కార్యదర్శి రాకేష్ చంద్రశర్మలు పాల్గొన్నారు.




