News

గుంటూరులో ఏటి అగ్రహారానికి ఫాతిమా నగర్ గా పేరు మార్పు…. మండిపడ్డ స్థానికులు….ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా

241views

గుంటూరు నగరంలో మున్సిపల్ అధికారులు ఓ వార్డ్ లైన్ పేరు మార్చి వివాదానికి ఆజ్యం పోశారు. నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఒకటి, ఆనంద త్రిదండి అగ్రహారంలోని రెండో లైన్ కు ఫాతిమా నగర్ అంటూ బోర్డులను కార్పోరేషన్ సిబ్బంది ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ మున్సిపల్ సిబ్బంది పేరు మారుస్తూ ఏర్పాటు చేసిన బోర్డుని తొలగించలేదు.

దీంతో స్థానిక యువకులు రంగంలోకి దిగి.. ఫాతిమా నగర్ నేమ్ బోర్డు చింపివేసి ఏటి అగ్రహారం అంటూ మళ్ళీ తమ లైన్స్ కు పూర్వపు పేరును బోర్డుపై రాశారు. అంతేకాదు ఈ సందర్భంగా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరోవైపు శ్రీ రామ్ నగర్ ను చైతన్య నగర్ గా మార్చారు. ఇదే విషయంపై స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

పేరు మార్పు పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో అగ్రహారం పేరు రాత్రికి రాత్రే మార్చేస్తూ.. ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏమిటి అంటూ ప్రశ్నించారు. అంతేకాదు విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరు లో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం ఈ తరహా సంఘటనలుకు ఎవరు సూత్రధారి అని సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు ఎందుకు ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారని మండి పడ్డారు. అదే విధంగా హిందూ ఎస్సీ లకు వ్యతిరేకంగా యున్న ప్రభుత్వ పోకడలు చూస్తే హిందువుల పై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.