News

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి ఉత్సవాలకు ముస్తాబు

272views

సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి ఈనెల 23వ తేదీన భక్తులకు నిజరూపంలో దర్శనం (చందనోత్సవం) ఇవ్వనున్నారు. ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.మల్లికార్జున తెలిపారు. శుక్రవారం సింహగిరిపై ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెల్లవారుజామున నాలుగు గంటలకు భక్తులకు సర్వ దర్శనాలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. రాత్రి ఏడు గంటలకు క్యూ మూసివేసి, అప్పటికి లైనులో వున్న భక్తులందరికీ దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చందనోత్సవం ఆదివారం సెలవురోజు రావడంతో దర్శనానికి సుమారు 1.1 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసుకుని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు. రూ.1000, రూ.1500 టికెట్లు కొనుగోలు చేసిన వారికి దర్శనం కోసం సమయాలను కేటాయించామన్నారు. ప్రముఖులకు దర్శనాల వల్ల సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామన్నారు. దేవస్థానం, పోలీసు, ప్రొటోకాల్‌ అఽధికారుల వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తామన్నారు. భక్తుల కోసం పాతఅడివివరం కూడలి, గురుకుల పాఠశాల, గోశాల కూడళ్ల వద్ద ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటుచేశామన్నారు.