News

గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం….. జాతరకు వెళ్లి వస్తుండగా దారుణం..!

250views

ఒడిశాలో మరోసారి కామాంధులు రెచ్చిపోయారు. జాతరను చూసి ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు గిరిజన​ బాలికలపై ఐదుగురు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఒడిశా.. కలహండి జిల్లాలో ఇద్దరు గిరిజన​ బాలికలపై ఐదుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా జరిగే జాతరను చూసి ఇంటికి తిరిగి వెళ్తుండగా బాధితులపై నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఏప్రిల్​ 16న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామ పెద్దల సహాయంతో బాధిత కుటుంబ సభ్యులు ఏప్రిల్​ 19న బీజేపుర్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై ఫిర్యాదు చేశారు. కాగా.. అత్యాచారానికి గురైన బాలికల వయసు 14 నుంచి 17 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై పోక్సో చట్టం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు బీజేపుర్ పోలీసులు తెలిపారు.

ఏప్రిల్​ 16న ముగ్గురు బాలికలు స్థానికంగా జరిగే జాతరను చూసేందుకు వెళ్లారు. జాతర అనంతరం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఐదుగురు యువకులు వారిని వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక నిందితులు.. ఇద్దరు మైనర్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాగా, మరో బాలిక తప్పించుకొని దగ్గర్లోని చెట్టు వెనుక దాక్కుంది.

ఘటనాస్థలి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం. అంతేకాకుండా అటవీ విస్తీర్ణం కూడా గణనీయంగా ఉండటం వల్ల నిందితులు దట్టమైన అడవిలో దాక్కుని ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. బాధితులకు.. గురువారం భవానీపట్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. నిందితులను 24 గంటల్లోగా అరెస్టు చేయకపోతే నిరసనలకు దిగుతామని కలహండి ఆదివాసీ సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ మాఝీ హెచ్చరించారు.