News

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆరు రోజులపాటు ఏపీలో యగ్నం – మంత్రి కొట్టు సత్యనారాయణ

271views

ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని.. అదేవిధంగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ.. ఏపీలో ఆరు రోజుల పాటు… చండీ రుద్ర రాజా శ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఙం నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది పథంలో దూసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఎండోమెంట్స్ భూముల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎండోమెంట్స్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లతో సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.500 కోట్ల విలువైన ఆలయ భూములను సర్వే చేసి పరిరక్షించామన్నారు. ఎండోమెంట్ భూములు దశాబ్దాలుగా వివాదంలో ఉన్నాయని, వాటిని కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఎండోమెంట్‌ పరిధిలో ఉన్న అనేక భూములు దాతలు కానుకగా ఇచ్చినవి అధికంగా ఉన్నాయని.. వీటి ప్రాధాన్యతను గుర్తించినట్లు మంత్రి పేర్కొన్నారు. కానీ అనేక ప్రాంతాల్లో ఆలయ భూముల వివాదాలు నడుస్తున్నాయని.. కొన్ని భూములు రెవెన్యూ రికార్డుల్లో 21A 1C పరిధిలోకి వచ్చినందున.. వివాదంలో ఉన్నయని ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో సర్వే నమోదులో కూడా తప్పులు ఉన్నాయన్నారు. నంబర్లు తప్పుగా నమోదు కావడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని .. వాటిని కూడా త్వరలో సరిచేసి.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇలాంటి అంశాలపై చర్చించి వివాదాలను పరిష్కరించి ఆలయ భూములను ప్రభుత్వ పరిధిలోకి తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ఆలయానికి సంబంధించిన పూర్తి భూ రికార్డులు, వాటి వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి పారదర్శకత తీసుకురావాలన్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆలయాల నిర్మాణం..
రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు అనేక నూతన దేవాలయాలను నిర్మిస్తున్నట్లు గతంలో మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేసిన సంగతి విదితమే.. ఆలయం లేని ప్రతి గ్రామంలో పది లక్షల రూపాయలతో ఇప్పటికే 1330 ఆలయాలను నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిని స్వచ్ఛంద సంస్థలతోపాటు.. ప్రభుత్వం కూడా.. మరో 1450 ఆలయాలను కొత్తగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆలయాలు లేని గ్రామం ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. ఇవే కాకుండా మరో 200 ఆలయాలు ఎమ్మెల్యేలు, స్థానిక నేతల సిఫార్సుల మేరకు.. వాటిని కూడా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. పనులపై ఎప్పటికప్పుడు రివ్యూ చేపడుతున్నామన్నారు. దాదాపు ఆలయాల నిర్మాణం అనేక ప్రాంతాల్లో పూర్తి కావచ్చిందని తెలిపారు. వివిధ నియోజకవర్గాల్లో చేపడుతున్నాం కాబట్టి.. ప్రతి 25 ఆలయాలకు ఓ ఇంజినీర్‌ని ప్రత్యేకంగా నియమించి పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. టీటీడీ సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు. ధర్మ పరిరక్షణే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.