
జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని “రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం” అనే నినాదంతో ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన, ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.పి.జగదీష్ తెలిపారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా గురువారం సత్యనారాయణపురం శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. శిబిరంలో మొత్తం 515 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ఆయుర్వేద వైద్య సలహాలు అందించడం జరిగిందన్నారు. ప్రధానంగా కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, పైల్స్, చర్మ వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. పి. జగదీష్ మాట్లాడుతూ ఆయుష్ శాఖ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఆదేశాల మేరకు, విజయవాడలోని డా.ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మరియు డా.నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న నిర్వహించనున్న 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా “రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం” అనే నినాదంతో ప్రజలకు ఆయుర్వేద వైద్య విధానం, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు తెలిపారు. అలాగే విజయవాడ బందరు రోడ్డులో ఉన్న శ్రీ ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వంద పడకల ఆసుపత్రిలో అన్ని రకాల రోగులకు నిష్ణాతులైన ఆయుర్వేద వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచిత ఓపీ, ఐపీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ టి.బల్లయ్య మాట్లాడుతూ, వందేళ్ల చరిత్ర కలిగిన ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మరియు ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఆయుర్వేద వైద్య విధానం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధుల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచడంతో పాటు, ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదం ప్రాధాన్యతను తెలియజేయడం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.