
(సెప్టెంబర్ 17: హైదరాబాద్ విమోచన దినోత్సవం)
బ్రిటిష్ వారి పాలన నుంచి స్వతంత్రం వచ్చేనాటికి మన దేశం ప్రధానంగా రాజసంస్థానాలుగా ఉండేది. ప్రజాస్వామిక రాజ్యంగా మారే క్రమంలో ఆ సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయి. భారత్‌ను బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకున్న తెల్లదొరతనం… రాజసంస్థానాలకు భారత్‌లో చేరడం, పాకిస్తాన్‌లో చేరడం, లేదా స్వతంత్రంగా ఉండడం అనే మూడు అవకాశాలనిచ్చింది. అప్పుడు భారత్‌లో విలీనం కాకుండా మూడు సంస్థానాలు మిగిలిపోయాయి. అవి కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్.
అప్పట్లో హైదరాబాద్ సంస్థానం అసఫ్‌జాహీ వంశంలో ఏడవ నవాబు అయిన నిజాం ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉండేది. అయితే నిజాం తోలుబొమ్మ మాత్రమే, అసలు పాలకుడు, నవాబు సలహాదారు అయిన ఖాసిం రిజ్వీ. హైదరాబాద్ సంస్థానంలోని హిందువులను భయభ్రాంతులను చేసి, వారిని మతం మార్చడానికి, సంస్థానం అంతటా షరియా పాలన అమలు చేయడానికీ ఖాసిం రిజ్వీ సుమారు 2లక్షల మంది రజాకార్లతో ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసాడు. అలాంటి ఖాసిం రిజ్వీ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలి, లేదా పాకిస్తాన్‌లో భాగం చేయాలి అని భావించాడు.
హైదరాబాద్ సంస్థానం భారతదేశం నడిబొడ్డున ఉంది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్‌లో విలీనం చేయడం ఆచరణసాధ్యం కాని వ్యవహారం. అంటే దాన్ని స్వతంత్ర రాజ్యంగా వదిలేయాలి. అప్పటికే రజాకార్ల దుష్ట దుర్మార్గ పాలనలో విసిగి వేసారిపోయిన సామాన్య ప్రజలు నిజాం పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు, భారతదేశంలో భాగంగా ఉండాలనే నిర్ణయించుకున్నారు. దాంతో రజాకార్లు ప్రజలను భయభ్రాంతులను చేయడానికి రక్తపాతం సృష్టించారు. సంస్థానంలోని సామాన్య హిందూ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారు. పురుషులను అమానుషంగా చంపారు. మహిళలు, బాలికలపై పాశవికంగా మానభంగాలకు పాల్పడ్డారు. తిరగబడిన వారిని చిత్రవధ చేసారు. దేశ విభజన సమయంలో పంజాబ్, బెంగాల్ ప్రాంతాల్లో ముస్లిములు హిందువుల మీద పాల్పడిన అరాచకాలకు దీటుగా హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు సైతం చెలరేగిపోయారు. వారి దాష్టీకాలకు నిరంకుశ నియంతృత్వ పాలకుడు నిజాం పూర్తిగా అనుమతించాడు.
హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలని నాటి భారత ప్రభుత్వం ప్రయత్నించింది. కశ్మీర్ మినహా మిగతా అన్ని రాజసంస్థానాలనూ విలీనం చేసిన సర్దార్ వల్లభాయి పటేల్‌కు హైదరాబాద్ బాధ్యత ఇచ్చింది. పటేల్ నిజాంకు అన్ని అవకాశాలూ ఇచ్చారు. 1948 సెప్టెంబర్‌లో హైదరాబాద్ సరిహద్దుల్లో భారత సైన్యాన్ని మోహరించారు. సంస్థాన ప్రజలపై అరాచకాలు ఆపాలని సూచించారు. రజాకార్ల బలాన్ని అతిగా ఊహించుకున్న నిజాం భారత ప్రభుత్వం ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. చివరికి సర్దార్ పటేల్ బలప్రయోగం చేయక తప్పలేదు. 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ పేరిట పోలీసు చర్య మొదలైంది. భారత సైన్యం రజాకార్లను తుత్తునియలు చేసింది. వాస్తవిక పరిస్థితిని అర్ధం చేసుకున్న నిజాం, సెప్టెంబర్ 17న కాల్పుల విరమణ ప్రకటించాడు. ఆరోజు హైదరాబాద్ సంస్థానం అధికారికంగా భారతదేశంలో విలీనమైంది.
నిజాం భారతదేశానికి లొంగిపోయాడు. హిందూ ప్రజల ధనమానప్రాణాలతో చెలగాటమాడిన ఖాసిం రిజ్వీ 1957 వరకూ జైలులో ఉన్నాడు. పాకిస్తాన్‌కు వెళ్ళిపోతానని కోరడంతో అతన్ని వదిలిపెట్టారు. ఆ సమయంలో అతడు రజాకార్లను తయారు చేసే ‘మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్’ సంస్థను అబ్దుల్ వాహెద్ ఒవైసీకి అప్పగించి పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవడంతో ప్రజలకు ఊరట కలిగింది. తెలంగాణ ప్రజల అస్తిత్వ యుద్ధాన్ని రైతాంగ సాయుధ పోరాటంగా మలచిన కమ్యూనిస్టు పార్టీ, నిజాంపై భారత ప్రభుత్వం పోలీసు చర్యకు దిగిన నాటినుంచీ ప్రజాపోరాటం నుంచి తప్పుకుని చారిత్రక తప్పిదానికి పాల్పడింది. అలా నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల రాక్షస పదఘట్టనల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిన 1948 సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినంగా జరుపుకుంటున్నాం