ArticlesNews

గణపయ్యపై అమితమైన భక్తి- ఇంట్లోనే గణేశ్ మ్యూజియం ఏర్పాటు

4views

వినాయకుడిపై ఉన్న అమితమైన భక్తితో తన ఇంటినే ‘గణేశ్ మ్యూజియం’గా మార్చేశారు ఓ వ్యక్తి. అందులో గత 40 ఏళ్లుగా ఆయన సేకరించిన గణేశుడి విగ్రహాలు, అలాగే గణపయ్య పూజకు సంబంధించిన వివిధ వస్తువులు ఉన్నాయి. వినాయక చవితి సందర్భంగా ఇంట్లో ఉన్న గణేశ్ మ్యూజియంను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఈ స్టోరీలో గణేశ్ మ్యూజియం ఎక్కడ ఉంది? అందులో ఉన్న గణపయ్య విగ్రహాలు ఎన్ని? దాని యజమాని ఎవరు? తదితర విషయాలు తెలుసుకుందాం పదండి.

40 ఏళ్లుగా సేకరణ
గుజరాత్‌ రాష్ట్రం జామ్‌నగర్‌‌లోని పంచేశ్వర్ టవర్ ప్రాంతానికి చెందిన దిలీప్ ధ్రువ్‌కు విఘ్నేశ్వరుడంటే అమితమైన భక్తి. అందుకే గత 40 ఏళ్లుగా దిలీప్ గణేశుడి విగ్రహాలు, ఆయన పూజకు సంబంధించిన ఇతర వస్తువులను సేకరిస్తున్నారు. వీటన్నింటినీ తన ఇంట్లోనే భద్రంగా ఉంచారు. అందుకోసం తన ఇంటినే ఏకంగా గణేశ్ మ్యూజియంగా మార్చేశారు. దీంతో దిలీప్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

తన విశిష్టమైన సేకరణ చాలా వైవిధ్యమైనదని గణేశ్ మ్యూజియం యజమాని దిలీప్ ధ్రువ్ వివరించారు. తన దగ్గర వెండి, చెక్క, గాజు, థర్మోకోల్ వంటి వివిధ పదార్థాలతో చేసిన గణేశుడి విగ్రహాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ విగ్రహాలు వివిధ పరిమాణాలలో ఉన్నాయని చెప్పారు. వాటిలో అతి చిన్న బొజ్జ గణపతి విగ్రహం కేవలం రెండు అంగుళాల ఎత్తైనది కాగా, అతి పెద్దది 2.5 అడుగుల ఎత్తైన విగ్రహమని స్పష్టం చేశారు. ఎంతో ఓపికతో గత 40 ఏళ్లుగా దాదాపు 3,000 పైగా వినాయకుడి విగ్రహాలు, కళాఖండాలను సేకరించానని అన్నారు.

చూపరులను ఆకట్టుకుంటున్న గణపయ్య విగ్రహాలు
దిలీప్ ధ్రువ్ విస్తృతమైన సేకరణలో గణేశుడి విగ్రహాలతో పాటు ఇతర సామగ్రి కూడా ఉంది. గత 40 ఏళ్లలో దిలీప్ 800 గణపయ్య విగ్రహాలను సేకరించారు. అలాగే 200 విఘ్నేశ్వరుడి కీచైన్‌లు, 500 గణపతి బప్పా ఫొటోలు, అలాగే గణేశుడికి సంబంధించిన పుస్తకాలు, ఇంకా అనేక ఇతర వస్తువులను సేకరించి తన ఇంట్లో భద్రంగా ఉంచారు. ఎంతో కాలంగా పోగుచేసిన ఈ అద్భుతమైన సేకరణను తనకే పరిమితం చేసుకోలేదు. ప్రజలను వీటిని చూసేందుకు ప్రజలను సైతం అనుమతిస్తున్నారు. అందుకే ఈ సేకరణను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు దిలీప్ ఇంటికి వస్తున్నారు. అక్కడ గణపయ్య విగ్రహాలు, పూజకు సంబంధించిన సామగ్రిని చూసి తరిస్తున్నారు.

సాధారణంగా ప్రజలు వినాయక చవితి నాడు విగ్రహాలను తమ ఇంట్లో ప్రతిష్ఠిస్తారు. అనంతరం గణపయ్యకు పూజ చేస్తారు. ఆపై నిమజ్జనం చేస్తారు. అయితే దిలీప్ విగ్రహ నిమజ్జనం అనే ఆచారాన్ని నమ్మరు. తన ఇష్ట దైవం (గణనాథుడు) విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా జాగ్రత్తగా భద్రపరుస్తారు. గత 40 ఏళ్లుగా ఆయనే ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అలాగే కొందరు ఇచ్చిన విగ్రహాలను దాస్తున్నారు. అవే ఓ పెద్ద సేకరణ మారి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

విదేశాల నుంచి విగ్రహాల సేకరణ
గత 40 ఏళ్లుగా దిలీప్ అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్‌ సహా పలు దేశాల నుంచి గణేశ్ కళాఖండాలను వ్యక్తిగతంగా సేకరిస్తున్నారు. ఆయన సేకరణలో గణేశుడు క్రికెట్ ఆడటం, స్కూటర్ నడపడం, వివిధ భంగిమలలో సంగీతం వాయించడం వంటి దైనందిన జీవితంలోని పలు కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు చూపించే ప్రత్యేకమైన విగ్రహాలు ఉన్నాయి. అలాగే గణేశుడి ఫొటో ఉన్న చెక్క ఫ్రేములూ, కీచైన్‌లు, పెన్ స్టాండ్‌లు, పేపర్‌వెయిట్‌లు, గోడ గడియారాలు, గుడి గంటలు, పురాతన తాళాలు ఉన్నాయి.

5000 విగ్రహాలు సేకరణ
అలాగే మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌‌కు చెందిన రాజ్‌ కుమార్‌ షా కూడా విఘ్నేశ్వరుడిపై అమితమైన భక్తితో ఇంటినే మ్యూజియంలా మార్చేశారు. మొదట దేవతామూర్తుల గ్రీటింగ్‌ కార్డులతో మొదలై, ఆ తర్వాత గణేశ్‌ విగ్రహాలను సేకరించడం ప్రారంభించినట్లు రాజ్ కుమార్ చెప్పారు. గత 20 ఏళ్ల నుంచి సుమారు 5000 విగ్రహాలను సేకరించినట్లు వెల్లడించారు. బైక్‌ నడుపుతున్నట్లుగా, చెస్‌ ఆడుతున్నట్లుగా, హార్మోనియం వాయిస్తున్నట్లుగా వివిధ రూపాల్లో ఉన్న గణేశ్‌ ప్రతిమలు రాజ్‌కుమార్‌ ఇంట్లో ఉన్నాయి.