News

భక్తి, శరణాగతి, ఆచార్య నిష్ఠను బోధించే ధాటీపంచకం

6views

తిరుపతి: శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులు సంసార బంధాల నుంచి విముక్తి పొంది, భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారనే సందేశాన్ని ‘ధాటీపంచకం’ అందిస్తుందని భద్రాచలానికి చెందిన శ్రీ స్థలశాయీ స్వామి తెలిపారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “శ్రీవైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలు” జాతీయ సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ స్థలశాయీ స్వామి మాట్లాడుతూ, దాశరథి రచించిన ధాటీపంచకం భక్తి, శరణాగతి, ఆచార్య భక్తి ప్రాధాన్యతను తెలియజేస్తుందని అన్నారు. భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి, ఆచార్యుల మార్గదర్శకత్వంలో భక్తి మార్గంలో ముందుకు సాగాలని ఈ స్తోత్రం ప్రేరణనిస్తుందని తెలిపారు.

దాశరథికి శ్రీరామానుజుల పది ఉపదేశాలు
మేల్కోటకు చెందిన శ్రీ జగ్గు వెంకటేశం స్వామి మాట్లాడుతూ, శ్రీరామానుజాచార్యులు దాశరథికి అందించిన పది ఉపదేశాలు భక్తి, శరణాగతి, ఆచార్య నిష్ఠ వంటి ఉన్నత విలువలను తెలియజేస్తాయని అన్నారు. భగవంతునిపై విశ్వాసంతో పాటు భగవద్భక్తుల సేవను కూడా పవిత్రమైన కైంకర్యంగా భావించాలని శ్రీరామానుజులు బోధించారని చెప్పారు. ఈ ఉపదేశాలు నేటి తరానికి కూడా స్ఫూర్తినిచ్చే ఆధ్యాత్మిక సందేశాలని వివరించారు.

‘కప్యాసం శ్రుతి’పై శ్రీరామానుజుల వ్యాఖ్యానం విశిష్టం
తిరుపతికి చెందిన ఆచార్య సంపత్‌కుమార్ స్వామి మాట్లాడుతూ, ‘కప్యాసం శ్రుతి’పై శ్రీరామానుజాచార్యులు చేసిన వ్యాఖ్యానం ఎంతో విశిష్టమైనదని తెలిపారు. వేదవాక్యాల్లోని అంతర్లీన ఆధ్యాత్మిక తాత్పర్యాన్ని భక్తులకు సులభంగా అర్థమయ్యేలా శ్రీరామానుజులు వివరించారని చెప్పారు. ఈ వ్యాఖ్యానంలో భగవంతుని దివ్యత్వం, సౌందర్యం, కళ్యాణ గుణాలు ప్రతిఫలిస్తాయని వివరించారు.

శ్రీభాష్యంలో జడభరత చరిత్రకు విశిష్ట స్థానం
మేల్కోటకు చెందిన శ్రీ ఆయీ నరసింహన్ స్వామి మాట్లాడుతూ, శ్రీభాష్యంలో జడభరత చరిత్రకు సంబంధించిన శ్లోకాలు, వాటి తాత్త్విక ప్రాధాన్యతను వివరించారు. జడభరతుని చరిత్ర ద్వారా ఆత్మతత్త్వం, దేహ–ఆత్మ భేదం, భక్తి, వైరాగ్యం వంటి అంశాలను తెలుసుకోవచ్చని తెలిపారు. ఇటువంటి ఉదాహరణల ద్వారా శ్రీరామానుజులు వేదాంత సిద్ధాంతాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా వివరించారని చెప్పారు.

నమ్మాళ్వార్ల తత్త్వజ్ఞానాన్ని సమాజానికి అందించిన శ్రీరామానుజులు
హైదరాబాద్‌కు చెందిన శ్రీమాన్ మరింగంటి కులశేఖరాచార్యులు ‘లక్ష్మీనాథాఖ్య సింధౌ’ శ్లోకంపై ప్రసంగించారు. శ్రీమన్నారాయణుని జ్ఞానసాగరం నుంచి నమ్మాళ్వార్లు తత్త్వజ్ఞానాన్ని గ్రహించి, ఆ జ్ఞానాన్ని ఆచార్య పరంపర ద్వారా భక్తులకు అందించారని వివరించారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శ్రీరామానుజాచార్యులు సమాజానికి మరింత విస్తృతంగా చేరువ చేశారని తెలిపారు.

ఎంబార్‌ చరిత్రను వివరించిన ప్రొఫెసర్ రంగనాథన్
తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠానికి చెందిన ప్రొఫెసర్ రంగనాథన్ స్వామి గోవింద భట్టర్‌ (ఎంబార్‌) చరిత్రను వివరించారు. శ్రీరామానుజాచార్యుల ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఎంబార్‌ అందించిన సేవలు, ఆచార్య భక్తి, శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ తిరుమళిశై ఆళ్వార్‌తో పాటు పలువురు పండితులు, పరిశోధకులు, భక్తులు పాల్గొన్నారు.