News

స్వాతంత్రం, స్వేచ్ఛ అనేవి అపారమైన త్యాగం, కఠోర శ్రమ ఫలితం : మోహన్ భాగవత్

27views

నాగపూర్ : 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ నాగపూర్ లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ జెండా పౌరులకు “త్యాగం, కర్తవ్య దీక్ష మరియు జ్ఞానం” వంటి విలువలను గుర్తుచేస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం అనేది అందరికీ గర్వకారణమని, సంబరాలు చేసుకునే సందర్భం అని అన్నారు.

1857 నుండి గనక లెక్కిస్తే.. 90 ఏళ్ల నిరంతర పోరాటం, అనేక త్యాగాలు మరియు ప్రాణార్పణల తర్వాత మన పూర్వీకులు స్వాతంత్రాన్ని సాధించారన్నారు. ఆ త్యాగం మరియు అంకితభావం యొక్క గొప్పతనం ఇప్పటికీ మన మన హృదయాల్లో అలాగే భద్రంగా వున్నాయన్నారు. అయితే.. మనం పొందిన స్వాతంత్రం, స్వేచ్ఛ అనేవి అపారమైన త్యాగం, కఠోర శ్రమ ఫలితమని, దీనిని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఆ స్వేచ్ఛను కాపాడుకోవాలన్నారు.

అలాగే సావర్కర్ చెప్పిన విధంగా ఉత్కృష్టమైన, ఉదాత్తమైన, ఉన్నతమైన మరియు అత్యంత మధురమైన వాటన్నింటినీ స్వీకరించాలని, ఎందుకంటే అవన్నీ కూడా స్వేచ్ఛా దేవతకు సహచరులుగా వున్నారన్నారు. స్వేచ్ఛకు సంబంధించిన అత్యుత్తమ, ఉదాత్తమైన, ఉన్నతమైన, పరమానందభరితమైన ఫలాలన్నీ కూడా మన దేశంలో సాకారం కావాలని ఆకాంక్షించారు. వీటిని నెరవేర్చే బాధ్యత మనపైనే వుందని ఉద్బోధించారు.

త్యాగపూరితమైన మరియు కర్తవ్యనిష్ఠతో కూడిన జీవితాన్ని గడపడం ద్వారా, సమాజంలో జ్ఞానం మరియు శాంతి నెలకొంటాయని, అలాగే మనస్సు కూడా పవిత్రమవుతుందని అన్నారు. అదే తెలుపు రంగుకు ప్రతీక అని అన్నారు. త్రివర్ణ పతాకంలోని రంగు సమృద్ధిని సూచిస్తుందన్నారు.