News

విద్య అనేది జ్ఞానం, నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వాల సమ్మేళనం

29views

విద్య అనేది జ్ఞానం, నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వాల సమ్మేళనమని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే లక్ష్య సాధనలో భాగంగా, ధర్మం, అర్థం, కామం మరియు మోక్షం అనే అంశాలను ఇముడ్చుకున్న సమగ్ర వికాసం కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి చెందిన భారతదేశం కోసం విద్య’ అనే అంశంపై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ‘శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్’ మరియు ముంబై విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హోసబళే హాజరయ్యారు.

నేడు ప్రజెంటేషన్లు ఇచ్చిన సంస్థలు సమాజం మరియు విద్యాసంస్థల మధ్య ఉన్న సమన్వయానికి చక్కని ఉదాహరణగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరస్పర సంభాషణల కొరత తీవ్రంగా వుందని, ఆ కొరత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ పద్ధతిని తిరిగి కొనసాగించాలని సూచించారు. అయితే.. పురాతన పద్ధతుల ద్వారానే బోధన అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే విషయం కాదని, దానికి బదులుగా, వారి అవసరాలకు అనుగుణమైన విధానాలను మనం రూపొందించుకోవాలన్నారు.

‘‘మనం నిర్మిస్తున్నది కేవలం ఓ కర్మాగారాన్ని మాత్రమే కాదు, ఓ నాగరికతను. కాబట్టి ఓ దేశంగా మనం వ్యక్తి నిర్మాణం, దానికి సంబంధించిన అంశలపై దృష్టి సారించాలి’’ అని రాధాకృష్ణ కమిషన్ నివేదిక ఇదే అంశంతో ముగుస్తుందని గుర్తు చేశారు. వికసిత భారత్ 2047 అనేది ఓ మైలు రాయి మాత్రమేనని, అదే ముగింపు కాదన్నారు. ప్రతి విధానం కూడా ఓ నియమిత కాలం కోసం రూపొందించబడుతుందని, అయితే.. మన మూలాలను మాత్రం విస్మరించకూడదన్నారు. అదే సమయంలో అవసరానికి అనుగుణంగా వాటిని మార్చుకుంటూ ముందుకు సాగాలి కానీ, మూలాన్ని మాత్రం మరిచిపోవద్దన్నారు.

కేవలం ఆర్థిక సమృద్ధి ద్వారానే కాకుండా, విలువలతో కూడిన జీవన విధానం, దృఢమైన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుతమైన భావన కలిగిన పౌరులను తీర్చిదిద్దడం ద్వారానే ‘వికసిత్ భారత్’ సాకారం అవుతుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశపు ప్రాచీన జ్ఞాన సంప్రదాయాలు మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రాల మేళవింపుతో కూడిన విద్యా విధానం ప్రస్తుత తరుణంలో అత్యవసరమని నొక్కిచెప్పిన ఆయన, ‘వికసిత్ భారత్-2047’ అనే జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా విద్యా రంగం, పరిశ్రమలు, ప్రభుత్వం మరియు సమాజం వంటి అన్ని వర్గాలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, వివిధ విశ్వవిద్యాలయాల ఉప-కులపతులు, సాంకేతిక విద్యాసంస్థల డైరెక్టర్లు, రాష్ట్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రులు అలాగే సామాజిక రంగానికి చెందిన మేధావులు ఈ సదస్సులో పాల్గొన్నారు; ‘వికసిత్ భారత్ 2047’ (అభివృద్ధి చెందిన భారతదేశం 2047) నిర్మాణంలో విద్య పాత్రపై వారు విస్తృతమైన చర్చలు జరిపారు.