News

సేవా భారతి కేంద్రం యువతకు స్ఫూర్తి, అవకాశాల కేంద్రం

0views
ఇండోర్ : జనజాతీయ సాధికారత కేంద్రంలో కొత్తగా నిర్మించిన స్కిల్ డెవలప్ మెంట్ అండ్ హెల్త్ కేర్ సెంటర్ ను ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేశ్ సోనీ ఈ నెల 30 న ప్రారంభించారు. జనజాతియ పద్ధతుల ప్రకారం అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం, వారు కొత్తగా నిర్మించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ఆరోగ్య సంరక్షణ కేంద్రం, హాస్టల్, సేంద్రియ వ్యవసాయ ప్రాంగణం మరియు ఇతర యూనిట్లను సందర్శించారు.
మేఘ్‌నగర్ బ్లాక్‌లోని బడా ఘోసాలియా గ్రామంలో ‘సేవా భారతి మాల్వా ప్రాంత్’ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.ముఖ్య అతిథి సురేష్ సోని మాట్లాడుతూ.. గిరిజన సమాజ అభివృద్ధి కేవలం సంక్షేమ పథకాల ద్వారానే కాకుండా విద్య, సంస్కారాలు, ఆరోగ్య రక్షణ మరియు స్వావలంబనల సమగ్ర కృషితోనే సాధ్యమవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సేవా భారతి కేంద్రం మొత్తం ప్రాంతీయ యువతకు స్ఫూర్తి మరియు అవకాశాల కేంద్రంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే సేవా కార్యక్రమాల్లో సమాజం మరింత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ జనజాతీయ సాధికారత కేంద్రం ద్వారా యువతకు, మహిళలకు నైపుణ్యాధారిత శిక్షణ అందించడంతో పాటు స్వయం ఉపాధితో అనుసంధానించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమాలలో కుట్టుపని, బ్యూటీ పార్లర్, మెహందీ, మొబైల్ రిపేరింగ్, మోటార్ బైక్ మరియు ట్రాక్టర్ రిపేరింగ్, వెల్డింగ్, ప్లంబింగ్, మోటార్ వైండింగ్, ఎయిర్ కండిషనర్ (AC) రిపేరింగ్, గణేష్ విగ్రహాల తయారీ వంటి అంశాలు ఉంటాయి. అంతేకాకుండా రైతులకు సేంద్రీయ వ్యవసాయం, వానపాముల ఎరువు (వెర్మి కంపోస్ట్) తయారీ, విత్తన బ్యాంకింగ్ మరియు ఆధునిక వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇస్తారు.
ఈ ప్రాంగణంలో అందుబాటులోకి వచ్చిన ఆరోగ్య కేంద్రం ద్వారా గిరిజన ప్రాంతాల గ్రామస్థులకు క్రమం తప్పకుండా వైద్య సేవలు, నిపుణులైన వైద్యుల సలహాలు మరియు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఇక్కడ ఉంటూ చదువుకునే హాస్టల్ విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం మరియు వృత్తి నైపుణ్యాలలో శిక్షణ ఇస్తారు.