
ముస్లిం వైయక్తిక చట్టం కింద ఉన్న బహుభార్యాత్వానికి మినహాయింపులను రద్దు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 82ను అన్ని మతాల వారికీ సమానంగా వర్తింపజేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది.
మహిళా హక్కుల కార్యకర్తలు జకియా సోమన్, నూర్జాహాన్ సఫియా నియాజ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లో, ముస్లింలలో అమలులో ఉన్న బహుభార్యాత్వం రాజ్యాంగంలోని సమానత్వం, మహిళల హక్కులకు విరుద్ధమని ప్రకటించాలని కోరారు. అలాగే ముస్లిం వివాహాలు, విడాకులను తప్పనిసరిగా ప్రభుత్వంలో నమోదు చేసే విధానం తీసుకురావాలని, తద్వారా రహస్య వివాహాలను అరికట్టవచ్చని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్‌ను ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఇలాంటి ఇతర వ్యాజ్యాలతో కలిపి విచారించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహన ధర్మాసనం నిర్ణయించింది.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం సమర్పించే సమాధానం, తదుపరి విచారణలో సుప్రీంకోర్టు చేసే పరిశీలనలు ఈ అంశంపై కీలకంగా మారే అవకాశం ఉంది.





