News

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై విద్యావేత్తల ఆగ్రహం.. 215 మంది బహిరంగ లేఖ

5views

: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన “గోమూత్ర నిపుణుడు” వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు శాస్త్రవేత్తలు, విద్యావేత్తల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ 215 మంది విద్యావేత్తలు ప్రియాంక గాంధీకి బహిరంగ లేఖ రాశారు.

యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. పరీక్షల సంస్కరణల కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బహిరంగ లేఖలో విద్యావేత్తలు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు వ్యక్తుల ప్రతిష్ఠతో పాటు దేశంలోని విద్యా, పరిశోధన రంగాలపై కూడా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణులతో అభిప్రాయ భేదాలు ఉన్నా, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగం ప్రోత్సహించే శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

ప్రొఫెసర్ కామకోటి ఇప్పటివరకు 150కిపైగా పరిశోధన పత్రాలు ప్రచురించడంతో పాటు 50కుపైగా పరిశోధన ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్నారని, డీఆర్‌డీఓ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలు పరిశోధకులు, విద్యావేత్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.

ప్రజా జీవితంలో ఉన్న నాయకులు శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పట్ల బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలని, వ్యక్తిగత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని విద్యావేత్తలు ప్రియాంక గాంధీకి సూచించారు.