
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని నగరవనంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని విత్తన బంతులను చల్లారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, పచ్చని ప్రకృతిని అందించాలంటే మొక్కల పెంపకం, విత్తనాల విస్తరణ వంటి కార్యక్రమాలను ప్రజలందరూ స్వచ్ఛందంగా చేపట్టాలని మైలవరం ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.. వర్షాకాలంలో ఈ విత్తనాలు మొలకెత్తి పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యలకు చెట్ల పెంపకమే శాశ్వత పరిష్కారమని అన్నారు. అడవుల విస్తీర్ణం పెరగాలంటే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని చెప్పారు. సీడ్ బాల్స్ ద్వారా అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా సహజసిద్ధంగా మొక్కలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు.
ప్రతి కుటుంబం కనీసం కొన్ని మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని తెలిపారు.





