News

సప్తర్షులు చూపిన జ్ఞానమార్గమే భారతీయ సంస్కృతికి దిక్సూచి : వెంకయ్య నాయుడు

7views

సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా, లోకజ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పించే గురువు స్థానం ఎప్పటికీ అమూల్యమైనదేనని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు.

అన్నమాచార్య భావనావాహిని ఆధ్వర్యంలో, డాక్టర్ శోభారాజు, నందకుమార్ నిర్వహణలో విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో జరిగిన గురుపూర్ణిమ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

విద్యార్థిలో నిద్రాణంగా ఉన్న శక్తులను మేల్కొలిపి జ్ఞానాన్ని, ఆనందాన్ని ప్రసాదించేది గురువేనని పేర్కొన్న వెంకయ్య నాయుడు, భారతీయ సంస్కృతి “ఆచార్య దేవో భవ” అంటూ గురువును దైవ స్వరూపంగా గౌరవించిందని చెప్పారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యప మహర్షుల వంటి సప్తర్షులు చూపిన జ్ఞానమార్గమే భారతీయ సంస్కృతికి నేటికీ దిక్సూచిగా నిలుస్తోందన్నారు. తరగతి గదిలో పాఠాలు చెప్పేవారే కాకుండా, జీవితానికి మార్గదర్శనం చేసిన ప్రతి ఒక్కరూ గురువులేనని స్పష్టం చేశారు.

అన్నమాచార్యులను గురువుగా భావించి, వారి కీర్తనల ద్వారా సనాతన ధర్మ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న డాక్టర్ శోభారాజును ఆయన అభినందించారు. వరుసగా 41 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం అన్నమయ్య కీర్తనలు ఆలకిస్తే జీవితంలో సానుకూల మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. యువత కీర్తనల్లోని ఆధ్యాత్మిక సందేశాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

సమాజంలో సాంకేతికత ఎంత పెరిగినా, లోకజ్ఞానం, సంస్కారం గురువులు, తల్లిదండ్రుల నుంచే లభిస్తాయని వెంకయ్య నాయుడు అన్నారు. సంస్కారం లేని చదువు సమాజానికి ఉపయోగపడదని పేర్కొంటూ, రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు, స్వామి వివేకానంద వంటి మహనీయులు చూపిన ఆధ్యాత్మిక, సామాజిక మార్గం నేటికీ సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.