News

శ్రీవారి సేవను గ్రామస్థాయికి విస్తరించేందుకు చర్యలు: టీటీడీ ఈవో

33views

తిరుమల : శ్రీవారి సేవను గ్రామస్థాయిలో మరింత విస్తరించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోందని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌లో గ్రూప్ సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న రెండో విడత శిక్షణ కార్యక్రమానికి మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవారి సేవను విస్తృతం చేయడంలో గ్రూప్ సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 50 వేల ఆలయాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో భక్తులకు సేవలు అందించే అవకాశాలను శ్రీవారి సేవకుల ద్వారా టీటీడీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణలో నేర్చుకున్న అంశాలను తమ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే సేవకులకు ముందస్తుగా అందించాలని అన్నారు. తద్వారా సేవకులు తిరుమలలో మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

శ్రీవారి సేవకులు తిరుమలకు వచ్చి స్వామివారికి సేవ చేయడంతో పాటు తమ స్వగ్రామాల్లోని స్థానిక ఆలయాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు.

సేవకుల పనితీరు ఆధారంగా సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ విధానం అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఈవో తెలిపారు. రేటింగ్ ఆధారంగా సేవా బాధ్యతల కేటాయింపుపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

అనంతరం గ్రూప్ సూపర్వైజర్లతో శిక్షణ కార్యక్రమం, శ్రీవారి సేవ విస్తరణ, భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మెరుగుపరిచే అంశాలపై చర్చించారు. వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎస్‌.ఎల్‌.ఎన్‌.టి. శ్రీనివాస్, చెన్నైకు చెందిన శ్రీ శరత్‌లను ఈవో శాలువాతో సత్కరించారు.