
గౌహతి : అసోంలో కొంతలో కొంత వరద పరిస్థితులు బాగుపడినా.. ప్రజలు తమ తమ ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టినా.. అది మోసుకొచ్చిన బురదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా రవాణా, సమాచారంతో పాటు పలు వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వందలాది గ్రామాలు సహాయక, రక్షణ చర్యలకు ఇప్పటికీ ఆటంకాలు వస్తున్నాయి.
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు, సేవా భారతి కార్యకర్తలు అహర్నిశలూ, పూర్తి అంకిత భావంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.వరదలకు గురైన శివసాగర్, చారైదేవ్, జోర్హాట్ జిల్లాల్లోని వేలాది కుటుంబాలు నిరాశ్రయులై ఆహారం, సురక్షితమైన తాగునీరు, ఆశ్రయం, అత్యవసర వైద్య సంరక్షణ లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు వారి ఇబ్బందులను తొలగించేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
విపత్తు సమయంలో స్వయంసేవకులు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సేవలు అందిస్తున్నారు. శివసాగర్ జిల్లాలోని బెట్‌బారీ ప్రాంతానికి చెందిన కాకతి గ్రామం, డి-గావ్, నెం.2 కొన్వర్ గ్రామం, చేతియా కైవర్త గ్రామాల్లో స్వయంసేవకులు భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న 200 మందికి పైగా ప్రజలను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు, కాంప్‌లకు తరలించారు. సుందర్ పుఖురి, బామున్ పుఖురి, గెలెకీ, రాజబారి వంటి నీటమునిగిన ప్రాంతాల్లో చిక్కుకున్న కుటుంబాలకు చిన్న పడవల సహాయంతో వండిన ఆహారం, తాగునీరు, ప్రాణ రక్షణ మందులు, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు జోర్హాట్ జిల్లాలోని ఎలెంగ్‌మారా, కటిరామ్ ఛుక్, కులై ఛుక్, నలియా ఛుక్, షెంచోవా ఛుక్, చారిగారి ఛుక్‌లలో కూడా సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. వరద బాధితులకు ప్రధానంగా తార్పాలిన్లు, దుప్పట్లు, దోమల బిళ్ళలు (కాయిల్స్), పొడి ఆహారం, బిస్కెట్లు, సురక్షితమైన తాగునీరు, సబ్బులు, పటిక (ఫిట్కిరి), అత్యవసర మందులను కూడా ఆరెస్సెస్ కార్యకర్తలు, సేవా భారతి కార్యకర్తలు అందిస్తున్నారు.
చిన్న పడవల ద్వారా ఆహారం, నీటిని అందించడమే కాకుండా, వృద్ధులు, మహిళలు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారిని స్వయంసేవకులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. “నర సేవే నారాయణ సేవ” అనే పవిత్ర ఆదర్శంతో ప్రేరణ పొందిన సేవా భారతి కార్యకర్తలు, స్వయంసేవకులు ఈ భయానక ప్రకృతి విపత్తు సమయంలో బాధితులకు అండగా నిలిచి వారికి నమ్మకాన్ని, ధైర్యాన్ని, బలాన్ని అందిస్తున్నారు.




