News

రాంచీ కేంద్రంగా భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ సమావేశాలు

5views

రాంచీ : భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారతీయ కార్యవర్గ సమావేశాలు సరళా బిర్లా విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. సమావేశం తొలి రోజున కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్‌లపై విస్తృతంగా చర్చించారు. వీటిలో రెండు లేబర్ కోడ్‌లకు బీఎంఎస్ మద్దతు తెలుపగా, మిగిలిన రెండింటిలోని పలు నిబంధనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.జూలై 26 నుండి జూలై 28 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, అనుబంధ సమాఖ్యల నుండి సుమారు 150 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.

వేతనం, సామాజిక భద్రత కోడ్‌లకు మద్దతు
వేతనాల కోడ్ (2019), సామాజిక భద్రత కోడ్ (2020)లను కార్మికుల ప్రయోజనార్థం తీసుకున్న ముఖ్యమైన చర్యలుగా బిఎమ్‌ఎస్ సమర్థించింది. కార్మికులకు మెరుగైన వేతన నిర్మాణాలను నిర్ధారించడానికి మరియు సామాజిక భద్రతా పరిధిని విస్తరించడానికి ఈ కోడ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపింది.ఈ కోడ్‌లు వేతన సంబంధిత నిబంధనలను క్రమబద్ధీకరించడానికి, పారదర్శకతను పెంచడానికి సహాయపడతాయని, అదేవిధంగా అసంఘటిత రంగాలతో సహా విస్తృత వర్గాల కార్మికులకు సామాజిక భద్రత వంటి ప్రయోజనాలను అందిస్తాయని బిఎమ్‌ఎస్ విశ్వసిస్తోంది.

అదే సమయంలో, పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020)లోని పలు నిబంధనలపై బిఎమ్‌ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కోడ్‌లోని 13 కీలక అంశాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో పాటు, అవసరమైన సవరణలు చేయాలని డిమాండ్ చేసింది.”పరిశ్రమ”, “వేతనాలు”, “కార్మికుడు” వంటి పదాల నిర్వచనాలు, చర్చలు జరిపే యూనియన్ల గుర్తింపు మరియు వార్షిక నివేదికల (యాన్యువల్ రిటర్న్స్) సమర్పణకు సంబంధించిన అంశాలపై బిఎమ్‌ఎస్ ముఖ్యంగా అభ్యంతరాలు తెలిపింది. కార్మికుల ప్రయోజనాలను కాపాడేలా, ట్రేడ్ యూనియన్ల పాత్రను బలపరిచేలా ఈ అంశాలను సవరించాలని నొక్కిచెప్పింది.

ప్రస్తుత నిబంధనలు ట్రేడ్ యూనియన్లను బలహీనపరిచే ప్రమాదం ఉందని మరియు సమిష్టి చర్చల ప్రక్రియ (కలెక్టివ్ బార్గెయినింగ్) సమర్థతను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కార్మికుల ప్రాతినిధ్యం బలంగా, ప్రభావవంతంగా ఉండేలా ఏ సంస్కరణ అయినా రూపుదిద్దుకోవాలని స్పష్టం చేసింది.

అలాగే, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ (2020)లోని 15 నిబంధనలపై బిఎమ్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. “ఫ్యాక్టరీ”, “పని విధానం” వంటి నిర్వచనాలతో పాటు పని ప్రదేశాల్లో భద్రత, ఆరోగ్య ప్రమాణాలు, పని పరిస్థితులను క్రమబద్ధీకరించే నిబంధనలపై ఈ ఆందోళనలు వ్యక్తమయ్యాయి.కార్మికుల భద్రత, ఆరోగ్య విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని స్పష్టం చేసింది. యజమానుల సౌకర్యం కోసం కార్మికుల హక్కులు లేదా భద్రతా ప్రమాణాలను విస్మరించేలా చట్టంలో ఎలాంటి అవకాశమూ ఉండకూడదని పేర్కొంది.

లేబర్ కోడ్‌లను పూర్తిగా వ్యతిరేకించడం తమ ఉద్దేశం కాదని, అవసరమైన సవరణల కోసం నిర్మాణాత్మకమైన ప్రయత్నాలు చేస్తున్నామని బిఎమ్‌ఎస్ స్పష్టం చేసింది. కార్మికుల హక్కులను సమర్థవంతంగా పరిరక్షించడం, ఉద్యోగ భద్రతను అందించడం మరియు పని ప్రదేశంలో గౌరవాన్ని నిలబెట్టడమే తమ ప్రాథమిక లక్ష్యమని తెలిపింది.

అన్ని రంగాలు మరియు అన్ని వర్గాల కార్మికులకు లేబర్ చట్టాలను ఏకరూపంలో అమలు చేయాలని బిఎమ్‌ఎస్ తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. కార్మికుల ప్రయోజనాలను కాపాడటానికే అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని, చట్టాల అమలు కూడా ఇదే సూత్రానికి అనుగుణంగా ఉండాలని నొక్కిచెప్పింది.

ఇక.. ప్రారంభ సమయంలో అధ్యక్షుడు ఎస్. మల్లేశం ప్రారంభోపన్యాసం చేశారు. వేగంగా మారుతున్న ప్రపంచ కార్మిక వాతావరణాన్ని గుర్తుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత, పెరుగుతున్న డిజిటలైజేషన్, గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థల విస్తరణ, ఉత్పత్తి వ్యవస్థలలో మార్పులు మరియు ప్రపంచ ఆర్థిక సవాళ్లు కార్మికులకు నూతన సంక్లిష్టతలను సృష్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.మారుతున్న ఆర్థిక వాతావరణంలో కార్మికుల హక్కు పరిరక్షణకు కార్మిక సంఘాల పాత్ర మరింత కీలకమవుతుందని ఆయన నొక్కిచెప్పారు.

ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 150 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాల సందర్భంగా కార్మికుల ప్రస్తుత పరిస్థితి, నూతన లేబర్ కోడ్‌ల ప్రభావం మరియు ఇతర సమకాలీన కార్మిక సమస్యలపై ప్రతిపాదనలు సమర్పించి చర్చించనున్నారు.

ఈ ప్రతిపాదనలపై క్షుణ్ణంగా చర్చించిన అనంతరం నిర్ణయాలు తీసుకుని, కీలక కార్మిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ వ్యూహాలను రూపొందించనున్నారు.