ArticlesNews

భగవ ధ్వజమే గురువు

8views

గురు పూర్ణిమ 

హిందూ సంప్రదాయంలో గురువుకు అమితమైన ప్రాధాన్యం ఉంది. తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రాముఖ్యత ఇస్తాము. అందుకే గురువును అర్చించుకోడానికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకున్నాము. మన దేశీయ కాలమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు గురు పూర్ణిమ పర్వదినం నిర్వహించుకుంటాము.

సనాతనమైన భారతీయ ధర్మానికి వేద విజ్ఞానమే మూలకందం. ఆ వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించిన మహర్షి వ్యాసుడు. అందుకే ఆయనను వేదవ్యాసుడు అని కూడా అంటాం. వేదాలతో పాటు ఆయన వేదాంగాలు, పురాణాలు వంటి అమూల్యమైన ధార్మిక సాహిత్యాన్ని మనకు అందించారు. అందుకే భారతీయులు అందరూ తొలి గురువుగా వేదవ్యాసుడిని పూజిస్తారు. మానవ జీవనానికి శ్రేష్ఠమైన గుణాలను నిర్ధారించి, యావత్ ప్రపంచానికీ ఎలా జీవించాలో మార్గదర్శనం చేసారు. అందుకే వ్యాసు భగవానుడిని సాక్షాత్తూ నారాయణుడి అవతారంగా పరిగణిస్తాం. ఆయనను గురువుగా పూజిస్తాం కాబట్టి గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం.

భారతీయ సంప్రదాయం ప్రకారం గురువు అంటే కేవలం అక్షరాల చదువు నేర్పించేవాడు కాదు. ధర్మం, నీతి బోధిస్తూ మోక్షమార్గాన్ని సాధించడం ఎలాగో ఉపదేశించేవాడు గురువు. అసలు ఆ పదంలోనే ఆ అర్ధం ఉంది. గు అంటే అజ్ఞానం. రు అంటే తొలగించేవాడు. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుతురు వైపు మనను నడిపించే వాడే నిజమైన గురువు. రామాయణంలో రాముడికి వశిష్ఠ విశ్వామిత్రుల వంటి గొప్ప గురువులు లభించారు. మహాభారతంలో అర్జునుడికి ద్రోణాచార్యుడు శ్రేష్ఠమైన గురువుగా నిలిచాడు. హైందవ ధర్మంలో మనకు ఎంతోమంది గురువులు ఉన్నారు. సదాశివుడు మొదలుకొని, శంకరాచార్యుడి మీదుగా మనకు భౌతిక విద్యలు నేర్పిన గురువుల వరకూ అందరినీ తలచుకుని ఆ పరంపరకు వందనం చేయడం అనూచానంగా వస్తున్న ఆచారం.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో గురువు అన్న భావనకు విశిష్ఠమైన గౌరవం ఉంది. భారతీయ సంప్రదాయ పద్ధతిలోని గురువులను ఆదరిస్తూనే, దేశనిష్ఠ కోసం భగవా ధ్వజాన్ని గురువుగా స్వీకరించి అర్చించడం సంఘ సంప్రదాయం. దాని వెనుక గొప్ప యోచన ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని స్థాపించిన డాక్టర్ కేశవ బలీరామ్ హెడ్గేవార్‌ను గురువుగా స్వీకరించాలని తొలినాళ్ళ స్వయంసేవకులు భావించారు. కానీ హెడ్గేవార్ దానికి అంగీకరించలేదు. ఒక వ్యక్తిని గురువుగా భావిస్తే అది రాగద్వేషాలకు తావిచ్చే అవకాశం ఉంది. సంఘంలో అలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. దేశం కోసం, ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాంటి త్యాగానికి, ఆత్మ సమర్పణకూ భగవా ధ్వజం… అంటే కాషాయ జెండా సనాతన ప్రతీక. అందుకే భగవా ధ్వజాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి గురువుగా స్వీకరించారు. హెడ్గేవార్‌జీ నిర్ణయాన్ని స్వయంసేవకులు హృదయపూర్వకంగా స్వీకరించారు. అందుకే, శతాబ్ద కాలంగా స్వయంసేవకుల గురు స్థానంలో కాషాయ జెండా రెపరెపలాడుతోంది.

భగవా ధ్వజం భారతీయులకు కొత్తదేమీ కాదు. వైదిక సాహిత్యంలో ‘అరుణ కేతు’ అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. కాషాయ వర్ణం త్యాగానికీ, శౌర్యానికీ ప్రతీక. ధర్మరక్షణ కోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి ధైర్య స్థైర్యాలు చూపించగల సామర్థ్యాన్ని కాషాయవర్ణం ప్రతిబింబిస్తుంది. వ్యక్తికి అతిముఖ్యమైన శీల నిర్మాణానికి కూడా కాషాయ వర్ణమే ప్రతీక. అందుకే సంఘానికి, భగవా ధ్వజమే గురువు. ఆ గురువుకు వందనం చేయడం ద్వారా స్వయంసేవకులు దేశసేవకు పునరంకితం అవుతారు.