ArticlesNews

జీవిత సత్యాల పాఠం

25views

‘‌పరమపద’ అంటే భగవంతుని నివాసమైన వైకుంఠం అని, ‘సోపానం’ అంటే మెట్టు అని అర్థం. అంటే మోక్షానికి దారితీసే మెట్టు అని దీని భావం. ‘వైకుంఠపాళి’ ఆట కూడా ఈ తత్వంతోనే ముడిపడి ఉంది. మంచి పనులు చేస్తే నిచ్చెనలు (పుణ్యం) ఎక్కుతామని, చెడు పనులు చేస్తే పాము (పాపం) మింగుతుందని ఇది సూచిస్తుంది. పూర్వం దీనిని ‘పరమపద సోపాన పటం’ అని పిలిచేవారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన రాత్రంతా నిద్రపోకుండా (జాగరణ) ఉండటం కోసం భక్తులు ఈ ఆటను ఆడేవారు. తద్వారా పుణ్యపాపాల గురించి ఆలోచిస్తూ దైవచింతనలో ఉండేవారు. ఈ ఆట కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, దీని వెనుక ఒక లోతైన తాత్విక సందేశం కూడా ఉంది.

ఈ ‌పటంపై గడులు, నిచ్చెనలు, పాములు ఉంటాయి. దయ, వినయం, సత్యం వంటి మంచి లక్షణాలకు నిచ్చెనలు సంకేతం. వీటివల్ల మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటాడు. కోపం, లోభం, అసూయవంటి దుర్గుణాలకు పాములు సంకేతం. వీటివల్ల మనిషి కిందకు పడిపోతాడు. అన్ని అడ్డంకులను అధిగమించి, చివరి గడి వైకుంఠం చేరుకోవడమే ఈ ఆట ఉద్దేశ్యం. జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, సన్మార్గంలో నడిస్తే మోక్షం లభిస్తుందని ఇది చెబుతుంది. పటంలో పాము తల ఒక గడిలో ఉంటే, దాని తోక చాలా కిందకు ఉంటుంది. అంటే చేసే చిన్న చెడు గుణం మనల్ని ఎంతో ఎత్తునుండి పాతాళానికి పడవేస్తుందని అర్థం.

‘వైకుంఠపాళి’ ఆట ‘‘జీవితంలో ఎన్ని పాపపు పాములు మింగినా, పుణ్యమనే నిచ్చెన సాయంతో దేవుడిని చేరుకోవచ్చు’’ అనే ఆశను కలిగిస్తుంది. పరమపద సోపాన పటంలో ‘జనలోకం’ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఒక ఉన్నతమైన స్థితి.

హిందు పురాణాల ప్రకారం మొత్తం 14లోకాలు ఉన్నాయి. అందులో భూలోకానికి పైన ఉన్న ఊర్ధ్వ లోకాలలో ఇది ఐదవది. పురాణాల ప్రకారం, ఈ లోకంలో బ్రహ్మదేవుని పుత్రులైన గొప్ప మహర్షులు సనక సనందనాదులు నివసిస్తారు. ఇక్కడికి చేరుకున్న వారు పవిత్రమైన వారు, జ్ఞాన సంపన్నులు. ఆటలో కింది గడుల నుండి నిచ్చెనల సాయంతో పైకి వెళ్తున్నప్పుడు, సాధారణంగా ‘తపస్సు’ లేదా ‘సత్యం’ వంటి నిచ్చెనలు ఎక్కినప్పుడు మనం ఇటువంటి ఉన్నత లోకాలకు చేరుకుంటాం. పరమపద సోపాన పటంలో ప్రయాణం ఈ విధంగా సాగుతుంది. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం.

జనలోకానికి చేరుకున్న సాధకుడు మళ్లీ వెనక్కి పడిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది, కానీ అక్కడ కూడా అహంకారం వంటి ‘పాము’ కరిస్తే కిందకు వచ్చే ప్రమాదం ఉంటుందని ఈ ఆట మనకు హెచ్చరిస్తుంది. పరమపద సోపాన పటంలో ‘తపోలోకం’ ఆరవ ఊర్ధ్వ లోకం. ఇది జనలోకానికి పైన, సత్యలోకానికి క్రింద ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలో ఇది అత్యున్నతమైన, కఠినమైన దశను సూచిస్తుంది. ‘తపస్సు’ అనే పదం నుండి ఈ లోకానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ నివసించే వారు నిరంతరం తపస్సులో మునిగి ఉండటంవల్ల దీనిని ‘తపోలోకం’ అంటారు. పురాణాల ప్రకారం, ఇక్కడ ‘వైరాజ’ అనే దేవతలు, అత్యంత కఠినమైన తపస్సు చేసిన మహర్షులు నివసిస్తారు. ఈ గడికి చేరుకోవడం అంటే ఆటగాడు ఇంద్రియాలను జయించి, పరమాత్మపై సంపూర్ణ ఏకాగ్రతను సాధించాడని, వైకుంఠానికి చాలా దగ్గరగా ఉన్నాడని అర్థం. ఇది సత్యలోకానికి వెళ్లేముందు ఉండే చివరిమెట్టు వంటిది. సాధారణంగా ‘వైరాగ్యం’ లేదా ‘నిశ్చల భక్తి’ అనే నిచ్చెనల ద్వారా సాధకుడు ఈ లోకానికి చేరుకుంటాడు. తపోలోకంలో ఉన్నప్పుడు కూడా ‘అహంకారం’ అనే పాము కరిస్తే, మనిషి నేరుగా మళ్లీ కింది లోకాలకు పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎంతటి గొప్ప తపస్సు చేసినా గర్వం దరిచేరకూడదని ఈ ఆట హెచ్చరిస్తుంది. తపోలోకంలో వారు అగ్నితేజస్సుతో వెలిగి పోతుంటారని, వారికి మరణం అనేది బ్రహ్మదేవుని ప్రళయకాలంలో తప్ప సాధారణంగా ఉండదని చెబుతారు. ఇక ‘సత్యలోకం’, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని నివాసం. ఇక్కడ అబద్ధం, మోసం, కోపం వంటి దుర్గుణాలకు తావుండదు. కేవలం సత్యం, ధర్మం మాత్రమే వర్ధిల్లుతాయి కాబట్టి దీనికి ‘సత్యలోకం’ అని పేరు వచ్చింది. ఈ లోకానికి చేరుకున్న ఆత్మలు తిరిగి జన్మించవు. పరమపద సోపానపటంలో దాదాపు ఆట చివరిదశకు చేరు కున్నారని దీని అర్థం. ఆఖరి గడి అయిన ‘వైకుంఠం’ చేరుకోవడానికి ముందు కొన్ని చిన్న చిన్న పాములని తప్పించుకుంటేనే మోక్షం లభిస్తుంది. బ్రాహ్మీ స్థితిని లేదా ఆత్మజ్ఞానాన్ని పొందినవారు ఈ లోకంలో ఉంటారు. పురాణాల ప్రకారం, ఈ లోకంలోని వారు బ్రహ్మ ప్రళయం వరకు అక్కడే ఉండి, ఆ తర్వాత నేరుగా పరమాత్మలో లీనమై పోతారు. సత్యలోకాన్ని కూడా దాటిన తర్వాతే మనకు లభించేది ‘పరమపదం’ లేదా ‘వైకుంఠం’.

‘కుంఠం’ అంటే అడ్డంకి లేదా కొరత అని అర్థం. ‘వైకుంఠం’ అంటే ఏ అడ్డంకులు లేనిది, ఎప్పటికీ తరిగిపోని ఆనందం ఉండే చోటు అని అర్థం. ఇది శ్రీమహావిష్ణువు నివాసం. హిందూ ధర్మం ప్రకారం, ఇక్కడికి చేరుకున్న జీవుడు మళ్లీ ఈ జనన మరణ చక్రంలోకి తిరిగి రాడు. 100వ గడి (లేదా పటాన్ని బట్టి 132వ గడి) కి చేరుకోవడమే ఆట ముగింపు. ఇది ఆత్మ పరమాత్మలో లీనమవ్వడాన్ని సూచిస్తుంది.

వైకుంఠంగడికి వెళ్లే ముందు ‘అహంకారం’ అనే పెద్ద పాము ముఖం ఉంటుంది. సరైన సంఖ్య పాచికతో(డైస్‌) ‌పడితేనే లోపలికి వెళ్తారు, లేదంటే పాము కరిచి మళ్లీ అథోలోకానికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే, దేవుడికి చేరువైనప్పుడు కూడా గర్వం ఉండకూడదని దీని అర్థం. పరమ పద సోపాన పటంలో కొన్ని ప్రత్యేక గడుల నుండి నేరుగా వైకుంఠానికి నిచ్చెనలు ఉంటాయి. నిజమైన భక్తి కలిగిన వారు తనను తాను భగవంతుడికి సమర్పించుకోవడంద్వారా మధ్యలో ఉండే లోకాలతో పనిలేకుండా నేరుగా వైకుంఠానికి చేరుకోవచ్చు.

పరమపద సోపానపటంలో లోభం, క్రోధం అనేవి మనిషిని ఆధ్యాత్మికంగా పతనంచేసే ప్రమాదకరమైన పాములు. వీటిని ‘అరిషడ్వర్గాలు’ అని పిలుస్తారు.’లోభం’ అంటే అతి ఆశ. ఉన్నదానితో తృప్తి పడకుండా, ఇతరులది కూడా కావాలను కోవడం. పుణ్య కార్యాల ద్వారా మంచి గడులకు చేరుకున్నప్పుడు, ఈ ‘లోభం’ అనే పాము గడి మీద కాలు వేస్తే, అది నేరుగా అధోలోకాలకు పంపేస్తుంది. ‘క్రోధం’ అంటే కోపం. వివేకాన్ని నశింపజేసే భయంకరమైన శత్రువు. పటంలో ఈ పాము నోరు సాధారణంగా మధ్యస్థ గడులలో ఉంటుంది. ఇది కరిస్తే సాధించిన పురోగతి అంతా కోల్పోయి, మళ్లీ మొదటి దశలకు పడిపోతారు. ‘‘క్రోధాద్భవతి సమ్మోహః’’ – కోపం వల్ల మనిషికి ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ పోతుంది. ఒక్క క్షణం కోపం జీవితకాలపు సాధనను బూడిదలో పోసిన పన్నీరు చేస్తుంది. అందుకే క్రోధం అనే పాముకు దూరంగా ఉండాలని ఈ ఆట హెచ్చరిస్తుంది.

‘కామం’ భౌతిక బంధాలలో చిక్కుకునేలా చేసి, పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. కోరికలు అదుపులో లేకపోతే మనిషి శాంతిని కోల్పోయి, మళ్లీ మళ్లీ జన్మలెత్తాల్సి వస్తుంది. ‘మోహం’ అంటే అజ్ఞానం వల్ల కలిగే భ్రమ. ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలియకపోవడం. నా ఇల్లు, నా సంపద, నా వారు అనే బంధనాల్లో చిక్కుకుపోవడం. మోహం అనే పాము కరిస్తే, మనిషి తాను చేరుకున్న జ్ఞానభూమి నుండి మళ్లీ మమకారపు లోయల్లోకి పడిపోతాడు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదనే సత్యాన్ని మర్చిపోతే పతనం తప్పదు. ‘మదం’ అంటే అహంకారం. ఈ పాము సాధారణంగా ఉన్నత లోకాలలో (జనలోకం లేదా తపోలోకం వంటి చోట్ల) ఉంటుంది. ఎందుకంటే మనిషి ఎత్తుకు ఎదిగే కొద్దీ గర్వం వచ్చే అవకాశం ఎక్కువ. ‘నేను’ అనే అహంకారం కలిగితే దేవుడికి దూరం అవుతాం. ‘మాత్సర్యం’ అంటే అసూయ. ఇతరుల ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం. ఇది మనిషి మనస్సును కలుషితం చేసి, సాధనను నాశనం చేస్తుంది. ఇతరుల సుఖాన్ని చూసి ఆనందించలేకపోవడం వల్ల మనం సాధించిన పుణ్యం కూడా హరించుకుపోతుంది.

సద్గుణాల నిచ్చెనలు : వైకుంఠపాళి పటంలో సద్గుణాల నిచ్చెనలు మనల్ని కింద నుండి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకెళ్లే మార్గాలు. పాములు మనల్ని ఎలా పాతాళానికి లాగుతాయో, ఈ నిచ్చెనలు మనల్ని అంత వేగంగా దైవానికి చేరువచేస్తాయి. ‘దయ’ ప్రాథమికమైన నిచ్చెన. అన్ని జీవుల పట్ల జాలి, కరుణ కలిగి ఉండటం. దయ కలిగిన మనిషి సామాన్య గడుల నుండి పుణ్యలోకాలకు వేగంగా చేరుకుం టాడు. నిస్వార్థ సేవవల్ల ఆత్మశుద్ధి జరుగుతుందని ఇది సూచిస్తుంది. నిజాయతీగా ఉండటం అనేది ఈ ఆటలో అతిపెద్ద నిచ్చెనలలో ఒకటి. సత్యం అనే నిచ్చెన నేరుగా ‘సత్యలోకం’ వంటి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఆడిన మాట తప్పకపోవడం, నిజాయతీగా బతకడం మోక్షానికి రాజమార్గమని దీని అర్థం. విద్య, జ్ఞానం వల్ల కలిగే అణకువ. వినయం అనే నిచ్చెన ‘మదం’ అనే పాముకు విరుగుడు. గర్వం లేకుండా ఉండేవారు దేవుడి•కి అత్యంత ప్రియమైన వారు. నిరంతర సాధనతో భగవంతునిపై మనస్సును నిలపడం నేరుగా ‘తపోలోకం’ గడికి చేరుస్తుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన వారికి ఉన్నత లోకాలు సులభంగా లభిస్తాయని దీని అర్థం.

పరమాత్మపై సంపూర్ణ విశ్వాసం: ఇది పటంలో చాలా పొడవైన నిచ్చెనగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ నిచ్చెన కింది గడుల నుండి నేరుగా వైకుంఠం ముఖ ద్వారం వరకు తీసుకెళ్తుంది. పుణ్యకార్యాలు, మంచి గుణాలు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయి. నిచ్చెన ఎక్కిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పై గడులలో కూడా పాములు పొంచి ఉంటాయి. అంటే, ఉన్నతస్థితికి వెళ్లిన తర్వాత కూడా మన పవర్తన సరిగ్గా లేకపోతే పతనం తప్పదు. నిజ జీవితంలో ఆ నిచ్చెనలే మన సంస్కారం. వైకుంఠపాళి పటంలో ప్రతి గడికి ఒక ప్రత్యేకమైన సంస్కృత నామం ఉంటుంది. ఈ పేర్లు ఆ గడిలో ఉండే ఆత్మస్థితిని లేదా ఆ వ్యక్తి పొందే ఫలితాన్ని సూచిస్తాయి.

పాతకాలపు వైకుంఠపాళి పటాలను గమనిస్తే, ప్రతి గడిలోనూ ఒక చిన్నబొమ్మ, దానికింద ఈ సంస్కృత పేరు స్పష్టంగా రాసి ఉండేది. ఆట ఆడే పిల్లలు ఆ పేర్లను చదువుతూ, ‘‘సత్యం పలికితే పైకి వెళ్తాం, అబద్ధం చెబితే పాము మింగుతుంది’’ అని చిన్నప్పుడే నైతిక విలువలను నేర్చుకునేవారు. గడి 107 (మహర్లోకం) జ్ఞానులు ఉండే స్థితిని సూచిస్తుంది. ఇక్కడికి చేరిన వారు భౌతిక ప్రపంచాన్ని దాటినట్లు లెక్క. గడి 118 (తపోలోకం) అత్యున్నతమైన తపస్సు చేసే స్థితి. ఇక్కడ నిశ్చలమైన మనస్సు అవసరం. 17 నిచ్చెన (దాన ధర్మాలు), 26 నిచ్చెన (యజ్ఞం), 38నిచ్చెన (నిత్యపూజ) వంటి గడుల నుండి పైకి తీసుకెళ్తాయి. పాములు-53 (అనృతం-అబద్ధం), 74 (మౌఢ్యం – అజ్ఞానం) వంటి గడుల వద్ద పాము నోరు ఉండి కిందకు లాగుతుంది. చివరి పాము వైకుంఠం చేరడానికి కేవలం ఒక్క అడుగు లేదా కొన్ని అడుగుల దూరంలోనే పొంచి ఉంటుంది.

మనిషి అన్ని లోకాలను దాటి, గొప్ప జ్ఞానిగా మారి, మోక్షానికి చేరువైన సమయంలో కూడా ‘‘నేను మోక్షం పొందబోతున్నాను’’ అనే సూక్ష్మమైన అహంకారం లేదా ‘మాయ’ కలిగితే, అది అతడిని మళ్లీ పాతాళానికి పడవేస్తుంది. ఈ పాము నోరు వైకుంఠం ముఖద్వారం వద్ద ఉంటే, దాని తోక మాత్రం చాలా కిందకు..అంటే మళ్లీ జనన మరణ చక్రం (భూలోకం) వైపుకు ఉంటుంది. అంటే చివరి క్షణంలో తడబడితే మళ్లీ మొదటి నుండి ప్రయాణాన్ని మొదలుపెట్టాలని దీని అర్థం. ఈ ఆటలో చివరి గడికి వెళ్లాలంటే పాచికల మీద కచ్చితమైన సంఖ్య పడాలి. ఉదాహరణకు మీరు 130వ గడిలో ఉంటే, వైకుంఠం (132) చేరుకోవడానికి కచ్చితంగా ‘రెండు’ మాత్రమే పడాలి. ఎక్కువ పడితే మళ్లీ వెనక్కి లెక్క పెట్టాలి లేదా అక్కడే ఉండాలి. మోక్షం పొందడానికి కచ్చితమైన సాధన, క్రమశిక్షణ ఉండాలని దీని అంతరార్థం. అది కేవలం మన ప్రయత్నం (ఆట) వల్లే కాకుండా, భగవంతుని అనుగ్రహంవల్ల కూడా సాధ్యమవుతుందని భక్తులు నమ్ముతారు.

‘‘నిచ్చెనల సాయంతో పైకి వెళ్లడం ఎంత కష్టమో, ఒక్క పాము కాటుతో కిందకు పడిపోవడం అంత సులభం’’ – ఇదే వైకుంఠపాళి మనకు నేర్పే అతిపెద్ద జీవిత సత్యం. సాధారణంగా పటంలోని 72 గడులు, మానవ శరీరంలోని 72,000 నాడులకు సంకేతం. అంటే ఈ ఆట మన దేహంలో జరిగే ప్రాణశక్తి ప్రయాణాన్ని సూచిస్తుంది. మరికొన్ని పటాల్లో 132 గడులు ఉంటాయి, ఇవి మనిషి దాటాల్సిన వివిధ జన్మల సంఖ్యకు సంకేతం. ‘అధర్మం’ అనే పాము నోరు ఉన్నత లోకంలో ఉండి, తోక ‘నరకం’ లేదా ‘పాతాళం’లో ఉంటుంది. అంటే ఎంతటి స్థితిలో ఉన్నా ధర్మం తప్పితే పతనం తప్పదని అర్థం. వైకుంఠానికి వెళ్లే ముందు ఉండే పాము పేరు ‘మాయ’. ఈ చివరి పాముని దాటడమే అత్యంత కష్టమైన పని. ఆటలో వేసే పాచికలు మన ప్రారబ్ధ కర్మను సూచిస్తాయి. కోరుకున్న సంఖ్య పడకపోవడం అంటే, జీవితంలో అన్ని మన చేతుల్లో ఉండవని, కొన్ని గత జన్మ కర్మల మీద ఆధారపడి ఉంటాయని దీని అర్థం. ఆటను కొనసాగించడం అంటే, కర్మను అనుభవి స్తూనే ముందుకు సాగాలని అర్థం.

పటాన్ని గమనిస్తే, అది వ•డు భాగాలుగా ఉంటుంది. భౌతిక వాంఛలు, నరకప్రాయమైన బాధలు(అథోలోకాలు). మానవ ప్రయత్నం, పుణ్య కార్యాలు(మధ్య లోకాలు.) దైవ చింతన, మోక్ష మార్గం (ఊర్ధ్వ లోకాలు). నిచ్చెనలు ఎప్పుడూ పాముల కంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. పతనం అవ్వడానికి వంద దారులు ఉంటాయి, కానీ పైకి వెళ్లడానికి కొన్ని మార్గాలు (సత్యం, ధర్మం, దయ) మాత్రమే ఉంటాయి. ఆ కొద్ది మార్గాలను పట్టుకున్నవాడే విజేత అవుతాడు.

వైకుంఠానికి వెళ్లే ప్రయాణంలో ఎనిమిది మంది దేవతలు ఆత్మను పరీక్షిస్తూ, యోగ్యులైన వారిని మాత్రమే పైలోకాలకు అనుమతిస్తారు. అష్టదిక్పాలక గడులు మనకు ఏం చెబుతాయంటే – ‘‘దేవుడిని చేరుకోవాలంటే కేవలం భక్తి ఉంటే సరిపోదు, ప్రకృతిని, ప్రకృతిశక్తులను (దిక్పాలకులను) గౌరవిస్తూ, నీతితో బ్రతకాలి.’’ ఈ గడులు దాటిన తర్వాతే సాధారణంగా ‘మహర్లోకం’ వంటి ఉన్నత లోకాలు ప్రారంభమవుతాయి.

వైకుంఠపాళి పటంలో క్రింది భాగంలో ఉండే గడులను అధోలోకాలు అంటారు. భూమికి దిగువన ఏడు లోకాలు ఉంటాయి. ఇవి సాధారణంగా మనిషిలోని తామస గుణాలు, భోగలాలసను, పతనాన్ని సూచిస్తాయి. పటంలో చాలా ఎత్తులో ఉన్నప్పుడు ‘అహంకారం’ అనే పెద్ద పాము కరిస్తే, అది నేరుగా ఈ అధోలోకాలకు తీసుకువస్తుంది. ఇక్కడ పడటం అంటే సర్వం కోల్పోవడం కాదు, మళ్లీ అక్కడి నుండి ‘ప్రాయశ్చిత్తం’ లేదా ‘సత్కర్మ’ అనే చిన్న చిన్న నిచ్చెనల ద్వారా పైకి రావచ్చు.

ఆధ్యాత్మిక సందేశం

వైకుంఠపాళి ఆట మనకు భయాన్ని మాత్రమే కాదు, ఆశను కూడా కల్పిస్తుంది. నరక గతులలో పడినా కూడా ప్రయాణం ముగిసిపోదు. నరక గతుల వద్ద కొన్ని చిన్న నిచ్చెనలు ఉంటాయి. ఇవి ‘ప్రాయశ్చిత్తం’ లేదా ‘పశ్చాత్తాపం’ను సూచిస్తాయి. అంటే చేసిన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరితే, మళ్లీ ప్రయాణం మొదలవుతుంది. నరక బాధలు అనుభవించిన తర్వాత, ఆత్మ మళ్లీ ‘మానవ జన్మ’ అనే గడికి చేరుకుంటుంది. అక్కడ నుండి మళ్లీ వైకుంఠం వైపు ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ‘‘నరకం అనేది ఒక శాశ్వతమైన స్థానం కాదు, అది ఒక స్థితి. మనం చేసే చెడు ఆలోచనలే మనల్ని నరకానికి తీసుకెళ్తాయి.’’

వైకుంఠపాళి ఆటలో మనం ఉపయోగించే ‘కాయిన్స్’ ‌కేవలం ఆట వస్తువులు మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా ఇవి ‘జీవాత్మ’కు సంకేతం. గతంలో చింతపిక్కలు, గవ్వలు లేదా చిన్న రాళ్లను నాణేలుగా వాడేవారు. సహజ సిద్ధమైన వస్తువులను వాడటం వల్ల ప్రకృతితో అనుసంధానం ఏర్పడుతుందని భావించేవారు.

ప్రతి ఆటగాడి ‘కాయిన్‌’ ఒక జీవాత్మను సూచిస్తుంది. బోర్డు మీద ఎన్ని కాయిన్స్ ఉన్నా, ప్రతి కాయిన్‌ ‌తన సొంత పాచికల సంఖ్య ప్రకారమే కదలాలి.  జీవిత ప్రయాణంలో ఎవరి కర్మను వారే అనుభవించాలి. ఒక కాయిన్‌ ‌నిచ్చెన ఎక్కితే ఇంకో కాయిన్‌ ఎక్కలేదు. ఎవరి ప్రయాణం వారిదే ‘‘ఏకైక జాయతే జంతుః ఏకైక ఏవ నశ్యతి’’ – పుట్టుక, చావు రెండూ ఒంటరివే అని దీని అర్థం.  ఒక గడిలో రెండు కాయిన్స్ ‌కలిసినప్పుడు లేదా ఒకరి కాయిన్‌ ‌మరొకరిని దాటి వెళ్లినప్పుడు  జీవితంలో తారసపడే ఋణానుబంధాలను సూచిస్తాయి. కొందరు తోడుగా వస్తారు, కొందరు దాటి వెళ్లిపోతారు. కానీ మన లక్ష్యం మాత్రం చివరి గడి (వైకుంఠం) చేరడమే.  కాయిన్‌ ‌పాము నోట్లో పడి కిందకు వచ్చినప్పుడు దానిని తీసి పక్కన పారేయం. మళ్లీ అక్కడి నుండే ప్రయాణం మొదలు పెడతాం.  ఇది ఆత్మ ఓర్పును సూచిస్తుంది. జీవితంలో ఎన్ని పతనాలు ఎదురైనా, మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలని, పతనం అనేది ప్రయాణం ముగింపు కాదని ఈ కాయిన్‌ ‌మనకు నేర్పుతుంది.   కాయిన్‌ అనేది జడ పదార్థం. దానిని కదిలించేది మనం వేసే పాచికలు (కర్మ/దైవ సంకల్పం). దైవం నిర్ణయించిన దారిలో ఆత్మ సాగిపోతుంటుంది. కానీ ఆ ప్రయాణంలో వచ్చే సద్గుణాల నిచ్చెనలను అందుకోవాలంటే ఆ కాయిన్‌ ‌సరైన దిశలో (ధర్మ మార్గంలో) ఉండాలి.

తరిగొప్పుల విఎల్లెన్‌ ‌మూర్తి
8008577834