News

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

30views

దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు వెల్లడించారు. అనంతరం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్టు చేస్తూ తన నిర్ణయానికి గల కారణాలను వివరించారు.

గత పది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ యువత ప్రయోజనాలకే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. నీట్‌ పరీక్షలో అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించామని, అనంతరం విజయవంతంగా మళ్లీ పరీక్ష నిర్వహించామని తెలిపారు.

తాను ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేసిన ప్రధాన్‌, దేశ యువత భవిష్యత్తుపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తూ, దేశంలో అనవసర వివాదాలకు తావివ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

దేశ సేవే తన అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్న ఆయన, దేశ ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఆందోళనలకు బదులుగా తమ చదువులపై దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా సేవలందించే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్‌ కృతజ్ఞతలు తెలిపారు.