News

అస్సాం వరదల బాధితులకు ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం

13views

“మానవ సేవే మాధవ సేవ” అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ మరోసారి తమ సేవా నిరతిని చాటుకుంది. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు రంగంలోకి దిగి అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రేషన్, మందులు , తాగునీటిని అందిస్తూ అండగా నిలుస్తున్నారు.

శివసాగర్ జిల్లాలోనే అత్యంత తీవ్రంగా ప్రభావానికి గురైన బేత్‌బారీ, ఆమ్‌గురి ప్రాంతాల్లో పరిస్థితులు ఎంతో ఆందోళనకరంగా మారాయి. స్వయంసేవకుల బృందాలు ఈ దుర్గమ ప్రాంతాలకు చేరుకుని రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్న బాధితులకు నేరుగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. నీరు కలుషితం కావడం వల్ల వచ్చే రోగాల బారిన పడకుండా ఉండటానికి స్వచ్ఛమైన తాగునీటిని, పొడి ఆహారాన్ని, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కోసం అవసరమైన మందులు, ఎండిన దుస్తులను బాధితులకు అందజేశారు.

భారతీయ సమాజంలో ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు ఎటువంటి పిలుపు కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా సహాయక చర్యలకు ముందుకొస్తారు. కష్టకాలంలో ఉన్న తోటి సోదరులకు సేవ చేయడం తమ పరమ కర్తవ్యమని, శివసాగర్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ సహాయ, పునరావాస కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్థానిక ప్రతినిధులు తెలిపారు. స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో , వారి ప్రాథమిక అవసరాలను తీర్చడంలో స్వయంసేవకులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.