
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం ఎప్పుడూ ‘ఏడు కొండల వాడ వేంకటరమణ గోవిందా గోవింద’ అనే నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. స్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామిని దర్శించుకోవాలనుకుంటారు. అయితే, శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతుండటంతో దాన్ని నియంత్రించి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు చక్కటి అనుభూతిని కలిగించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) తిరుమలను నో హార్న్, సైరన్ జోన్‌గా ప్రకటించి తిరుమల వ్యాప్తంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది.
ప్రొటోకాల్ వాహనాలు సైతం అవసరమైతే తప్ప : జీఎన్‌సీ టోల్‌గేట్ నుంచి తిరుమల వ్యాప్తంగా, రెండు ఘాట్‌రోడ్లలో నిబంధనలు అమలవుతున్నాయి. ఎప్పటి నుంచో ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. అంబులెన్స్‌లు, వీవీఐపీల ప్రొటోకాల్ వాహనాలు సైతం అవసరమైతే తప్ప సైరన్‌లు ఉపయోగించరాదు. నిబంధనలు అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు, జిల్లా రవాణాశాఖ అధికారులు తరచూ ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. మోటారు వాహన చట్టంలో అనుమతించిన డెసిబుల్స్ పరిమితిని మించి శబ్దం చేసే వాహనాలు, సైలెన్సర్లు ఉపయోగించడం నేరంగా పరిగణించి చోదకులపై కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ఆరునెలల్లో శబ్ద కాలుష్యాన్ని సృష్టించిన 42 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.64,475 జరిమానా విధించారు.




