ArticlesNews

ధార్మిక దార్శనికుడు కావ్యకంఠ గణపతి ముని

4views

(  జులై 27 –  కావ్యకంఠ గణపతి ముని వర్ధంతి  )

భారతీయ ఆధ్యాత్మిక, వైదిక శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి వాటిని ఆధునిక జీవనానికి వర్తింపజేయవచ్చునని నిరూపించిన మహానుభావుడు కావ్యకంఠ గణపతి ముని. ఒకవైపు తపస్సు, ఆధ్యాత్మిక సాధన చేస్తూనే మరోవైపు సమాజసేవ, సాహిత్యసేవలలోనూ అసమాన ప్రతిభ కనబరిచారు. రమణ మహర్షిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనదే.

కావ్యకంఠ గణపతి ముని అసలు పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి. ఆయన ప్రస్తుత విజయనగరం జిల్లా కలవరాయి గ్రామంలో 1878 నవంబరు 17న జన్మించారు. తల్లిదండ్రులు నరసింహశాస్త్రి, నరసమాంబ దంపతులు. గణపతి పదేళ్ళ వయసు వచ్చేనాటికే జ్యోతిష, మంత్రశాస్త్రాలలో పట్టు సాధించారు. ఆయనకు 12వ యేట విశాలాక్షితో వివాహమైంది. గణపతి 22ఏళ్ళ వయసులో నవద్వీపంలో విద్వత్ పరీక్షలలో ఉత్తీర్ణులై కావ్యకంఠ అనే బిరుదు సాధించారు. కొంతకాలం తెలుగు అధ్యాపకుడిగా పనిచేసారు. ఆయన కుటుంబ జీవితాన్ని గడుపుతూనే తపస్సు ద్వారా మోక్షం సాధించేందుకు ప్రయత్నించారు. భార్య అనుమతితో సంవత్సరంలో ఆరు నెలలు తపస్సు చేసేవారు. దేశంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో తపస్సు చేసి వివిధ మంత్రాలను సిద్ధింపజేసుకున్నారు. ఆ క్రమంలోనే అరుణాచలంలో బ్రాహ్మణ స్వామిని దర్శించారు. మౌనంగా తపస్సు చేసుకునే ఆ స్వామితో తత్వబోధ చేయించి, ఆయనను రమణ మహర్షిగా ప్రపంచానికి పరిచయం చేసారు. రమణ మహర్షి గణపతి మునిని ‘నాయనా’ అని పిలవడంతో ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది.

కావ్యకంఠ గణపతి పారలౌకిక విషయాల మీదనే కాదు, లౌకిక వ్యవహారాల మీద కూడా దృష్టి సారించారు. వేదాలను జనసామాన్యానికి చేరువ చేసేందుకు అపారమైన సాహిత్యాన్ని సృజించారు. భారతదేశపు చరిత్రాంశాలను ఋగ్వేదం నుంచి నిరూపించే ‘భారత విమర్శ’ అనే గ్రంథాన్ని రచించారు. ఆయన స్వతంత్ర పోరాటంలోనూ భాగమయ్యారు. 1923లో కాకినాడ కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొని పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయని వేదశాస్త్ర ప్రమాణాలతో నిరూపించారు. 1924లో కాంగ్రెసులో చేరారు. అనతికాలంలోనే తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులు అయ్యారు. బెల్గాం సభలో అస్పృశ్యతా నివారణ శాస్త్ర సమ్మతమేనని నిరూపిస్తూ ప్రసంగం చేసారు. అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన కృషికి హైదరాబాదు ఆదిహిందూసంఘానికి చెందిన హరిజనులు ఆయనను పల్లకిలో ఊరేగించి ‘ముని’ అనే బిరుదునిచ్చారు.

గణపతి మునిని బ్రిటిష్‌వారి అమానుష పరిపాలన తీవ్ర వేదనకు గురిచేసింది. భారతీయులు ధర్మాచరణను విస్మరించడం వల్లనే దేశానికి దుర్గతి పట్టిందని ఆయన ఆవేదన చెందారు. సమాజాన్ని ఆధ్యాత్మికంగా జాగృతం చేసేందుకు ఎంతగానో కృషి చేసారు. సంస్కృత భాషలో విస్తృతంగా ఆధ్యాత్మిక సామాజిక సాహిత్యాన్ని సృజించారు. నూరుకు పైగా గ్రంథాలను రచించారు. గణపతి ముని జీవిత చరమాంకంలో ఖరగ్‌పూర్‌లో గడిపారు. అక్కడ ఆయనకు గుంటూరు లక్ష్మీకాంతం దంపతులు పరిచర్యలు చేసారు. చివరకు, కావ్యకంఠ గణపతి ముని 1936 జులై 25న ఖరగ్‌పూర్‌లో నిర్యాణం చెందారు.

వేదవేదాంగవేత్తగా, కావ్యకంఠుడిగా, సమాజ సంస్కర్తగా, అస్పృశ్యతా నివారణ ఉద్యమకారుడిగా, స్త్రీల హక్కుల పోరాట యోధుడిగా, రమణ మహర్షిని ప్రపంచానికి పరిచయం చేసిన నాయనగా గణపతి ముని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.