
సమల్ఖ (పానిపట్): హర్యానాలోని సమల్ఖలో ఉన్న మాధవ స్మృతి కాంప్లెక్స్‌లో రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యవర్గ, ప్రతినిధి మండలి తొలి అర్ధవార్షిక మూడు రోజుల సమావేశం ప్రారంభమైంది. ప్రముఖ్ సంచాలిక శాంతకుమారి జీ, ప్రముఖ్ కార్యవాహిక సీతా గాయత్రీ జీ సమక్షంలో సమావేశం ప్రారంభమైంది.
సమావేశం ఆరంభంలో జ్యోతి ప్రజ్వలన నిర్వహించి, సమితి మాజీ అఖిల భారత సహ కార్యవాహికలు రుక్మిణి అక్కా జీ, రేఖాతాయి రాజే జీలకు నివాళులర్పించారు. అలాగే దివంగత సమితి కార్యకర్తలు, ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన దేశప్రజలు, సైనికులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల్లో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ప్రముఖ్ కార్యవాహిక సీతా గాయత్రీ జీ మాట్లాడుతూ, ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు అవసరమైన మానవ వనరులు, ఆర్థిక శక్తి భారతదేశానికి పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశభక్తి, సేవాభావంతో మహిళా శక్తిని మరింత చైతన్యపరచడం రాష్ట్ర సేవికా సమితి ప్రధాన లక్ష్యమని తెలిపారు. వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ (మౌసీ జీ) జయంతిని ‘సంకల్ప దివస్’గా నిర్వహిస్తూ దేశసేవకు మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇరాన్‌కు భారతదేశం అందించిన వైద్య సహాయం ‘వసుధైవ కుటుంబకం’ అనే భారతీయ సంస్కృతి భావనకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో భారత్ సాధించిన స్వర్ణ పతకం, ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల విజయం దేశం వివిధ రంగాల్లో సాధిస్తున్న పురోగతికి నిదర్శనాలని అన్నారు.
ఈ సమావేశంలో దేశంలోని 38 ప్రాంతాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధి సేవికలు పాల్గొంటున్నారు. ప్రారంభ సమావేశంలో సమితి కార్యకలాపాలపై నివేదిక సమర్పించగా, శాఖలు, మిలన్ కేంద్రాలు, సేవా కార్యక్రమాలు విస్తరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,866 ప్రాంతాల్లో విద్య, సంస్కారాలు, స్వయం సమృద్ధి, ఆరోగ్యం తదితర రంగాల్లో సేవా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు.
2026లో దేశవ్యాప్తంగా నిర్వహించిన 250 శిక్షణా శిబిరాల్లో సుమారు 15,241 మంది సేవికలు శిక్షణ పొందినట్లు నివేదికలో వెల్లడించారు. అలాగే ఈ ఏడాది బెంగాల్‌లో సుదీర్ఘ విరామం అనంతరం సేవికలు ‘పథ్ సంచాలన్’ నిర్వహించడం, జమ్మూలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ శిక్షణా శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం, ఛత్తీస్‌గఢ్‌లో సామాజిక సామరస్య సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలను ప్రస్తావించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సేవికా సమితి, భారతీయ విద్వత్ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘నారీ సే నారాయణి’ సదస్సుకు దేశవ్యాప్తంగా 1,500 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగింపు సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరై మహిళా సాధికారతపై దిశానిర్దేశం చేశారు.
సమల్ఖలో ప్రారంభమైన ఈ మూడు రోజుల సమావేశంలో దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల బాధ్యులు పాల్గొంటుండగా, సమావేశాలు జూలై 26న ముగియనున్నాయి.





