
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఆళ్వార్ సదనం నూతన రూపును సంతరించుకుంటోంది. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ సత్రం భవనానికి దేవస్థానం అధికారులు మరమ్మతులు చేపట్టగా, ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు అన్ని వసతులతో కూడిన ఆధునిక వసతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
ఒకప్పుడు భక్తులకు వసతి కల్పించడంతో పాటు వివాహాలు వంటి శుభకార్యాలకు వేదికగా నిలిచిన ఆళ్వార్ సదనం, శిథిలావస్థకు చేరడంతో కొంతకాలంగా వినియోగానికి దూరమైంది. దీంతో భవనం పూర్తిగా దెబ్బతినకుండా సంరక్షించేందుకు పునరుద్ధరణ పనులు చేపట్టారు.
పాత నిర్మాణ శైలిని యథాతథంగా కాపాడుతూ, అవసరమైన చోట్ల ఆధునిక సౌకర్యాలను జోడిస్తున్నారు. పైకప్పు, గోడలు, ఫ్లోరింగ్, విద్యుత్ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తూ భవనానికి కొత్త మెరుగులు దిద్దుతున్నారు.
ఆహ్లాదకరంగా పరిసరాల అభివృద్ధి
ఆళ్వార్ సదనం పరిసరాలను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఉద్యానవనాల అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. పచ్చదనంతో నిండిన వాతావరణాన్ని కల్పించేలా వివిధ రకాల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ప్రశాంతమైన వసతి అనుభూతి కలిగేలా దేవస్థానం అధికారులు చర్యలు చేపడుతున్నారు.




