
విశాఖపట్నం: గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సుమారు 32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణకు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ట్రాఫిక్, భద్రత, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన తుది సమీక్ష సమావేశంలో ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు, 28 సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్‌కు పోలీసు, జీవీఎంసీ అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించాలని ఆదేశించారు. అలాగే 27 నుంచి 29వ తేదీ వరకు ఆరు షిఫ్టుల్లో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి జోన్‌కు జోనల్ కమిషనర్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించి, సమగ్ర పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
భక్తులకు విస్తృత సౌకర్యాలు
తొలిపావంచ, అడవివరం జంక్షన్, హనుమంతువాక, అప్పుఘర్, మాధవధార, ఎన్ఎస్‌టీఎల్ గేట్, గోపాలపట్నం ప్రాంతాల్లో ఏడు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం 28 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి, అక్కడ తాగునీరు, వలంటీర్లు, వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. అదేవిధంగా మొత్తం 31 వైద్య శిబిరాలు, 595 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు కొండపై ఇప్పటికే ఉన్న మరుగుదొడ్లను కూడా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అప్పుఘర్ వద్ద భక్తులకు షవర్ బాత్ సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఏఐతో పర్యవేక్షణ – పిల్లలకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు
గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల రద్దీని కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పర్యవేక్షించే విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గిరి ప్రదక్షిణ మార్గంలో 70 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని అన్ని కంట్రోల్ రూమ్‌ల డ్యాష్‌బోర్డులతో అనుసంధానం చేయాలని సూచించారు. చిన్నారులు తప్పిపోకుండా వారికి ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు అందించే ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులకు ఆదేశించారు.





