
రామమందిరాన్ని లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న నకిలీ వార్తలు, సమన్వయంతో కూడిన దుష్ప్రచారాలు ఆ పుణ్యక్షేత్రాన్ని అప్రతిష్టపాలు చేయడానికి సనాతన వ్యతిరేక శక్తులు చేస్తున్న తీవ్ర ప్రయత్నాన్ని బట్టబయలు చేస్తోంది. ఈ సమగ్ర నివేదిక దురుద్దేశపూరిత అబద్ధాల వలయాన్ని నిశితంగా ఛేదిస్తుంది. దొంగతనం, ఆర్థిక అవకతవకలపై ప్రతి ఒక్క ఆరోపణను వాస్తవాలు, అధికారిక దర్యాప్తుల ద్వారా ఖండనకు అర్హమైన వైనాన్ని వెల్లడిస్తోంది. రామమందిరం నుండి బంగారు రామచరితమానస్, కాక్‌భూషుండి విగ్రహం, ధనుస్సు, వెండి ఫలకం, కిరీటం సహా అనేక పవిత్ర వస్తువులు అదృశ్యమయ్యాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఈ దుష్ప్రచారాలను శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెంటనే ఖండించింది. ప్రతి ఒక్క పవిత్ర వస్తువు పూర్తిగా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది.
బంగారు రామచరితమానస్ మందిర ప్రాంగణంలో భద్రంగా ఉంది. పూజనీయమైన కాక్ భూషుండి విగ్రహం భరత్ కుటి మందిరంలో సంరక్షణలో ఉంది. అక్కడ విగ్రహానికి నిత్య ధూప దీపనైవేద్యాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. భవ్యమైన రామమందిరాన్ని అప్రతిష్టపాలు చేయడానికి, సనాతన ధర్మాన్ని బలహీనపరచడానికి బరితెగించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మందిరానికి అందిన విరాళాల గురించి భక్తులను తప్పుదారి పట్టించేలా దురుద్దేశపూర్వకమైన పుకార్లను సృష్టించడం సనాతనధర్మ వ్యతిరేకశక్తులకు ఇది మొదటిసారి కాదు.
పొంతన లేని ఫొటోతో అసత్య ప్రచారం
ఒక కారులో దాచిన నగదు ఫొటోను సనాతన ధర్మ వ్యతిరేక ప్రచారకులు తెరమీదకు తెచ్చారు. దానిని మందిరంలో విరాళాల దొంగతనంతో కావాలనే ముడిపెట్టారు. రామమందిరాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఒక పథకం ప్రకారం తప్పుడు ప్రచారానికి దిగారు. విశ్వాస్ న్యూస్ జరిపిన ఫ్యాక్ట్ చెక్ – వాస్తవ విచారణ ఈ మోసాన్ని పూర్తిగా బట్టబయలు చేసింది. నిందితుడు అవినాష్ శుక్లా ఫొటో నిజమైనదే అయినప్పటికీ స్వాధీనం చేసుకున్న నగదు దృశ్యానికి ,అయోధ్య వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేదని తేలింది. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు జరిపిన దాడులకు సంబంధించి ఈ నగదు వీడియో(దీని నుంచి ఫొటోను సృష్టించారు) 2025 నుండి ప్రచారంలో ఉంది. జూన్ 25,2026న అయోధ్య విరాళాల అవకతవకలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. కనుక ఒక నకిలీ స్కామ్‌ను సృష్టించడానికి సంబంధంలేని ఫొటోలను, వీడియో లను ఆలయ వ్యతిరేక శక్తులు కావాలనే వ్యాపింప జేస్తున్నాయనే విషయం దీనితో బట్టబయలైంది.
పుకార్లకు చెల్లుచీటీ.. కాక్‌భూషుండి విగ్రహం భద్రం
విరాళంగా ఇచ్చిన వెండి కాక్‌భూషుండి విగ్రహం రామమందిర ప్రాంగణం నుండి అదృశ్యమైందంటూ వ్యాపించిన కథనం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ ఆ విగ్రహం పూర్తిగా సురక్షితంగా ఉందని అధికారిక ధ్రువీకరణలో రుజువు కావడంతో ఆ కథనం బూటకమని తేలింది. మెరుగైన భద్రత, సంరక్షణకోసం, ఆ పవిత్ర విగ్రహాన్ని అయోధ్యలోని ప్రసిద్ధ భరత్ కుటీ మందిరంలో జాగ్రత్తగా ఉంచారు. ఆ విగ్రహం భద్రంగా ఉందని, అది కనిపించకుండా పోయిందంటూ వైరల్ అవుతున్న ఆరోపణలు పూర్తిగా కల్పితమని స్థానిక పూజారి అనురాగ్ పాండే ధ్రువీకరించారు. దీంతో ఆలయంలో విగ్రహాల నిర్వహణపై అపవాదులు వేయడానికి పనిచేస్తున్న దుష్ప్రచార యంత్రాంగానికి గట్టి దెబ్బ తగిలింది.
విరాళం వాపసు పోస్టు కార్డు నకిలీది
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ, రామమందిరానికి తాను ఇచ్చిన రూ. 1,100 విరాళాన్ని వాపసు ఇవ్వాలని డిమాండ్ చేశారన్న ట్లుగా, మందిర వ్యతిరేకశక్తులు ఒక కల్పిత పోస్ట్‌కార్డును సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. అయితే, జరిపిన డిజిటల్ ఫోరెన్సిక్స్, పరిశోధన, విశ్లేషణ కేంద్రం (డీఎఫ్‌ఆర్‌ఏసీ) కఠినమైన వాస్తవ తనిఖీలో ఆ పోస్టుకార్డు పూర్తిగా నకిలీదని తేలింది. దీంతో అలాంటి ప్రకటన గానీ, పోస్ట్‌కార్డు గానీ ఎన్నడూ జారీ కాలేదని నిర్ధారణ అయింది. వైరల్ అయిన ఆ పోస్ట్ పూర్తిగా అబద్ధమని జితు పట్వారీతో పాటుగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అమిత్ శర్మ ఖండించారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రం చుట్టూ అనవసర వివాదాలను సృష్టించడానికి నిరంతరం నకిలీ వార్తలను అరాచక శక్తులు కల్పిస్తున్న వైనాన్ని ఇది స్పష్టం చేస్తుంది.
బంగారు రామచరితమానస్ భద్రం
తమ కుటుంబం విరాళంగా ఇచ్చిన సుమారు రూ. 5 కోట్ల విలువైన 151 కిలోల బంగారు పూత పూసిన రామచరితమానస్‌ను రామమందిరం నుంచి రహస్యంగా తొలగించారని ఆరోపించడం ద్వారా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్. లక్ష్మీనారాయణన్ అనవసరమైన వివాదాన్ని లేవనెత్తారు. ఆయన చేసిన నిరాధారమైన ఆరోపణలను శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెంటనే ఖండించింది.
ఆ బంగారు గ్రంథం పూర్తిగా సురక్షితంగా ఉందని, దానికి లెక్క కూడా ఉందని ప్రజలకు భరోసా ఇచ్చింది. స్థలాభావం, భద్రతా కారణాల దృష్ట్యా, అధిక విలువ కలిగిన ప్రతి విరాళాన్ని అందరికి కనిపించే ప్రాంతంలో ఒకేసారి ప్రదర్శించడం ఆచరణ సాధ్యం కాదని ట్రస్ట్ స్పష్టం చేసింది. తద్వారా ఆలయ పారదర్శకతను ప్రశ్నార్థకం చేయాలనుకున్న ఆ మాజీ అధికారి ప్రయత్నాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది.
రామమందిరంలో చోరీకి బెంగళూరు ఘటన వీడియోతో లింకు!
భవ్యమైన మందిరం చుట్టూ అరాచకం నెలకొని ఉందనే తప్పుడు ప్రచారం చేయడానికి ఒక గుడిలో చోరీకి సంబంధించి వైరల్ అయిన ఒక సీసీటీవీ వీడియోను రామమందిరం వ్యతిరేకులు రంగంలోకి దించారు. ఇండియా టుడే చేసిన ఒక వాస్తవ తనిఖీ ఈ నకిలీ కథనాన్ని ఖండించింది. ఆ ఫుటేజ్ వాస్తవానికి 2024లో బెంగళూరులోని గాలి ఆంజనేయ స్వామి మందిరంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించినదని వెల్లడించింది. రామ జన్మభూమి ప్రాంగణం పవిత్రతను, భద్రతను అపఖ్యాతిపాలు చేయడానికి, కర్ణాటకకు చెందిన ఈ పాత వీడియోను ఆన్‌లైన్‌లో వామపక్ష- ఉదారవాద వర్గాలు మోసపూరితంగా తిరిగి ప్రచారం చేశాయి.
200 కిలోల వెండి చోరీ అవాస్తవం
రామ మందిరం నుండి విరాళంగా వచ్చిన దాదాపు 200 కిలోగ్రాముల వెండి ఇటుకలు, కడ్డీలు చోరీకి గురయ్యాయని ఆరోపిస్తూ మీడియాలో ఒక వర్గం చేసిన ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తిగా ఖండించింది. సిట్ జరిపిన సమగ్ర ఆడిట్‌లో ఎటువంటి దొంగతనం జరగలేదని నిర్ధారణ అయింది. ఆలయ నిర్మాణ అవసరాల కోసం చాలా వరకు వెండిని చట్టబద్ధంగా కరిగించగా, అనేక వెండి కడ్డీలను అధికారిక నాణేలుగా ముద్రించడం కోసం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు భద్రంగా పంపించారు. ఆలయ రికార్డులలో ప్రతి గ్రాము వెండి కూడా నమోదు చేసినట్టు తేలింది. దీంతో ఆ తప్పుడు ప్రచారం పూర్తిగా అసత్యమని తేలింది.
వెండి ఇటుక సురక్షితం.. రౌత్ ఆరోపణ అసత్యం
తమ పార్టీ విరాళంగా ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక అదృశ్యమైందని ఆరోపిస్తూ ఆలయ ట్రస్టును లక్ష్యంగా చేసుకునేందుకు శివసేన (యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్‌రౌత్ ప్రయ త్నించారు. అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిన క్షుణ్ణమైన పరిశీలనలో ఆయన ఆరోపణ కేవలం రాజకీయ ఆర్భాటమేనని తేటతెల్లమైంది.
ఆ విరాళం అధికారిక లెడ్జర్లలో పక్కాగా నమోదై ఉన్న వైనాన్ని సిట్ కనుగొంది. అంతేకాకుండా, విరాళంగా వచ్చిన వెండిని భవ్యమైన ఆలయ నిర్మా ణానికి నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే కచ్చితంగా వినియోగిస్తున్నామని, విలువైన కానుకలన్నీ పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పునరుద్ఘాటించింది.
రామమందిరంపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వ్యాఖ్య కల్పితం
భక్తులను ఆగ్రహానికి గురిచేసేలా రూపొందించిన కల్పిత గ్రాఫిక్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. వాటిలో నవభారత్ టైమ్స్ లోగోతో ఉన్న ఒక నకిలీ పోస్ట్‌కార్డ్ కూడా ఉంది. ఆ పోస్ట్‌కార్డ్‌లో ‘‘మేము రామ మందిరాన్ని నిర్మించాము; మేము దానిని దోచుకున్నా, దొంగిలించినా, లేదా అమ్మేసినా, దానితో ప్రతిపక్షానికి ఏమి సంబంధం?’’ అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నట్లు తప్పుగా చిత్రీకరించారు.
ఓన్లీ ఫ్యాక్ట్ జరిపిన దర్యాప్తులో ఆ వ్యాఖ్య పూర్తిగా కల్పితమని, ఆ మీడియా సంస్థ అటువంటి నివేదికను ఎన్నడూ ప్రచురించలేదని రుజువైంది. నవభారత్ టైమ్స్ ఆ గ్రాఫిక్‌ను పూర్తిగా నకిలీదని అధికారికంగా ప్రకటించగా, తన వ్యక్తిత్వాన్ని, పవిత్ర ఆలయాన్ని అప్రతిష్టపాలు చేయడానికి పన్నిన ఈ పథకాన్ని మనోజ్ తివారీ తీవ్రంగా ఖండించారు.
సీఎం యోగిపై అభూత కల్పన
2027లో రామ మందిర నిధులపై తమ పార్టీ(బీజేపీ) మాత్రమే సంపూర్ణ నియంత్రణను కలిగి ఉంటుందని, ప్రతిపక్షాలు వాటిని దుర్వినియోగం చేయకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అడ్డుకున్నట్లు ఒక డిజిటల్ మార్ఫింగ్ గ్రాఫిక్‌ను ప్రచార నెట్‌వర్క్‌లు వ్యాప్తి చేశాయి. అయితే, వైరల్ అయిన ఆ చిత్రం ఎన్‌డీటీవీ ఇండియాకు చెందిన ఒక అసలైన వార్తా గ్రాఫిక్‌ను మార్ఫింగ్ చేసి సృష్టించిన ఒక చౌకబారు నకిలీదని వివరణాత్మక డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణలో రుజువైంది. ముఖ్యమంత్రి అటువంటి ప్రకటన ఎన్నడూ చేయలేదు. ఇది రామ మందిర నిధుల స్వచ్ఛమైన ఆర్థిక నిర్వహణపై సందేహాలు రేకెత్తించి, రాజకీయం చేయడానికి అరాచక శక్తులు చేస్తున్న ఒక వ్యవస్థీకృత ప్రయత్నాన్ని బట్టబయలు చేసింది.
రామ మందిరం చుట్టూ కేంద్రీకృతమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని దెబ్బతీయ డమే లక్ష్యంగా ఈ నిరాధారమైన వదంతులు, అభూత కల్పనలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు పుష్కలంగా ఉన్న సనాతనధర్మ వ్యతిరేక శక్తులు ఈ దురాగతానికి పాల్పడుతున్నాయి. రాజకీయ ఆర్భాటాల నుండి చౌకబారు డిజిటల్ కుతంత్రాల వరకు ఇవ్వన్నీ కూడా ఆలయ ట్రస్టును అప్రతిష్టపాలు చేయడానికి, సనాతన ధర్మాన్ని అనుసరించే వారి మనోభావాలను దెబ్బతీయడానికి ఉద్దేశించినవి. ఇలాంటి ప్రతి ఒక్క కథనం, అభూతకల్పనలు వాస్తవాలు, అధికారిక దర్యాప్తుల ద్వారా పూర్తిగా వీగిపోయాయి. దర్యాప్తు సంస్థలు, కఠినమైన వాస్తవ తనిఖీల మద్దతుతో సంపూర్ణ పారదర్శకతను కలిగి ఉన్న శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా ఒక దుర్భేద్యమైన కోటలా నిలుస్తోంది. పుణ్యక్షేత్రం పవిత్రత, సంపద, వైభవం పూర్తిగా అభేద్యంగా, సురక్షితంగా ఉండేలా భరోసా ఇస్తోంది.
-జాగృతి డెస్క్





