News

కాజలో 1,600 ఏళ్ల నాటి గణేశ విగ్రహాలు

34views

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామ పొలాల్లో 1,600 సంవత్సరాల నాటి రెండు చిన్న గణేశ విగ్రహాలు వెలుగు చూశాయని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్, సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన సింహాద్రి వెంకట్రామరెడ్డి పొలాల్లోని పాటిదిబ్బను దున్నుతుండగా నాగలికి తగిలి పైకి వచ్చాయని తెలిపారు. ఇవి 3 సెం.మీ., 5 సెం.మీ. ఎత్తు, 2 సెం.మీ. 4 సెం.మీ. వెడల్పు గల ఎర్ర ఇసుక రాతి(చింతామణి రాయి)తో తయారైనట్లు ఉన్నాయన్నారు. వీటితోపాటు ఎరుపు, నలుపు, నలుపు- ఎరుపు, గచ్చకాయ, గోధుమ రంగు మట్టి పాత్రల పెంకులు దొరికాయని, అవి ఒకటి, నాలుగో శతాబ్దం నాటివని వెల్లడించారు. పల్నాడు జిల్లా చేజర్ల కపోతేశ్వర ఆలయంలో ఉన్న పాలరాతి గణేశ విగ్రహాన్ని పోలి ఉండటాన్ని బట్టి ఈ రెండు గణేశ ప్రతిమలు, 4వ శతాబ్దిలో కందరాపుర (ప్రస్తుతం గుంటూరు జిల్లా చేజెర్ల) కేంద్రంగా పాలించిన ఆనందగోత్రిన రాజుల కాలం నాటివని, చారిత్రక ప్రాధాన్యం గల వీటిని కాపాడుకోవాలని శివనాగిరెడ్డి.. రైతు వెంకట్రామరెడ్డిని కోరారు.