News

సంకుచిత రాజకీయ ప్రయోజనాలు, దేశ వ్యతిరేక కుట్రలకు విద్యార్థి సమాజం వేదిక కాబోదు – ఏబీవీపీ

38views
జంతర్ మంతర్ వద్ద నీట్-యూజీ (NEET-UG) సహా వివిధ విద్యా సంబంధిత సమస్యలపై నిర్వహించిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న అశాంతి, విద్యార్థులమని చెప్పుకునే కొందరు అల్లరి మూకలు మరియు భద్రతా సిబ్బంది మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలు, ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన సంఘటనలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తీవ్ర దురదృష్టకరంగా భావిస్తోంది.
విద్యార్థుల న్యాయమైన ఉద్యమాన్ని కొందరు రాజకీయ స్వార్థపరులు, సంఘ వ్యతిరేక శక్తులు హింసకు, అల్లర్లకు వేదికగా మార్చేందుకు ప్రయత్నించాయని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనల్లో గాయపడిన విద్యార్థులు, భద్రతా సిబ్బందికి ఏబీవీపీ తన సానుభూతిని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఆకాంక్షిస్తోంది. విద్యార్థుల న్యాయమైన సమస్యలకు పరిష్కారం సార్థకమైన సంభాషణ, సున్నితమైన వైఖరి, సంస్థాగత సంస్కరణల ద్వారానే సాధ్యమని ఏబీవీపీ స్పష్టం చేసింది.
నీట్-యూజీతో పాటు ఇతర పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ఏబీవీపీ ప్రారంభం నుంచే విద్యార్థుల పక్షాన నిలిచి పోరాడుతోంది. పరీక్షా వ్యవస్థలో విశ్వసనీయత, పారదర్శకతను కాపాడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరపాలని మొదటగా డిమాండ్ చేసింది. అలాగే జాతీయ పరీక్షల సంస్థ (NTA) ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 2024 నుంచి ఇప్పటివరకు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఏబీవీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తోంది.
అందువల్ల పోటీ పరీక్షల పవిత్రత, పారదర్శకత, సంస్థాగత సంస్కరణలపై సమగ్ర సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, పరీక్షా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా, జవాబుదారీతనంతో కూడినదిగా మార్చేందుకు కాలపరిమితితో కూడిన స్పష్టమైన సిఫార్సులు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
విద్యార్థుల సహజమైన సమస్యలు, న్యాయమైన డిమాండ్లను సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు, దేశ వ్యతిరేక అజెండాలకు, దేశంలో అస్థిరత, ఘర్షణలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలకు ఉపయోగించకూడదని ఏబీవీపీ పేర్కొంది. ఇటువంటి ప్రయత్నాలు దేశ అంతర్గత స్థిరత్వం, సమగ్రత, సార్వభౌమాధికారం, జాతీయ ఐక్యతను బలహీనపర్చేందుకు ప్రయత్నించే ‘డీప్ స్టేట్’ వంటి భారత వ్యతిరేక శక్తులకు పరోక్షంగా బలం చేకూరుస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
భారత విద్యార్థి సమాజం జాగరూకత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువల పట్ల అంకితభావంతో ఉందని, ఎలాంటి రాజకీయ దారి మళ్లింపులకు, విదేశీ ప్రభావాలకు, దేశ వ్యతిరేక కుట్రలకు తాము సాధనంగా మారబోమని ఏబీవీపీ స్పష్టం చేసింది. విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, సమాజంలోని అన్ని వర్గాలు విద్యార్థుల న్యాయమైన సమస్యలను రాజకీయ ప్రయోజనాలకు దూరంగా ఉంచి, శాంతియుత, ప్రజాస్వామ్య వాతావరణంలో పరిష్కరించేందుకు సహకరించాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డా. వీరేంద్ర సింగ్ సోలంకి మాట్లాడుతూ, “నీట్-యూజీతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాలు దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల్లో ఆందోళన కలిగించాయి. ఈ న్యాయమైన అంశాలపై ఏబీవీపీ మొదటి నుంచే విద్యార్థులతో కలిసి పోరాడుతోంది. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు మళ్లించే ప్రతి ప్రయత్నం విద్యార్థుల ప్రయోజనాలకు అన్యాయం చేయడమే. విద్యార్థి శక్తిని రాజకీయ అజెండాలకు లేదా భారత ఐక్యత, సమగ్రత, సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించే శక్తుల ప్రయోజనాల కోసం వినియోగించనివ్వం. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం సంభాషణ, సున్నితమైన స్పందన, సంస్థాగత సంస్కరణల ద్వారానే సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలలో పారదర్శకత, విశ్వసనీయతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర సంస్కరణలు చేపట్టాలి” అని అన్నారు.