News

సంప్రదాయ పంటల వైవిధ్యానికి లారీ డ్రైవర్ కృషి- ‘ఫ్రీ’గా దేశీయ కూరగాయల విత్తనాల పంపిణీ

28views

కనుమరుగవుతున్న సంప్రదాయ పంటలను పరిరక్షించేందుకు దేశీయ కూరగాయల విత్తనాలను సేకరించి రైతులకు ఉచితంగా అందిస్తున్నాడు ఓ లారీ డ్రైవర్. బీరకాయ, సొరకాయ, దోసకాయ, చిక్కుడు సహా 20కి పైగా అరుదైన దేశీయ రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నాడు. ఈ పని వల్ల అతడికి ఎటువంటి ఆర్థిక లాభం లేకపోయినా అపారమైన సంతృప్తిని పొందుతున్నాడు. ఈ స్టోరీలో సంప్రదాయ పంటల సాగు కోసం పాటుపడుతున్న డ్రైవర్ ఎవరు? అతడికి ఈ ఫ్యాషన్ ఉండడానికి గల కారణాలేంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.

దేశంలోని పలు ప్రాంతాల్లో విత్తనాలు పంపిణీ
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని గొల్లహళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్ వృత్తిరీత్యా లారీ డ్రైవర్. ఆయనకు భార్య నేత్రావతి, తొమ్మిదో తరగతి చదువుతున్న చైత్రశ్రీ (కుమార్తె), సెవెన్త్ చదువుతున్న లేఖన్‌ (కుమారుడు) ఉన్నారు. మంజునాథ్ తన వాహనాన్ని ఒక సంచార విత్తన బ్యాంకుగా మార్చేశాడు. కర్ణాటక, పొరుగు రాష్ట్రాలలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలకు దేశీయ విత్తనాలను తీసుకెళ్తాడు. మంజునాథ్ ఎల్లప్పుడూ తన డ్రైవర్ సీటు పక్కన ఒక చిన్న సంచిని ఉంచుకుంటాడు. అందులో సంప్రదాయ బీరకాయ, సొరకాయ, దోసకాయ, చిక్కుడుతో సహా 20కి అరుదైన దేశీయ కూరగాయల విత్తనాలు ఉంటాయి.

రైతులతో మాటామంతీ
మంజునాథ్ ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి లారీపై వెళ్లేటప్పుడు రైతుల దగ్గర కూరగాయల విత్తనాలను మార్పిడి చేసుకుంటాడు. తద్వారా ఒక ప్రాంతంలో సేకరించిన విత్తనాలను మరొక ప్రాంతంలో పంటగా వేసేలా చూస్తాడు. ఇప్పటి వరకు మంజునాథ్ 100 మందికి పైగా రైతుల వద్ద దేశీయ విత్తనాలను మార్పిడి చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రతీ విత్తన మార్పిడికి సంబంధించిన రైతు పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ సహా పూర్తి వివరాలను రాసుకుంటాడు. టీ, భోజనం, సరుకులను ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు ఎక్కడ లారీ ఆగినా మంజునాథ్ అక్కడి రైతులు, స్థానికులతో మాట్లాడుతాడు. ఆ గ్రామంలో ఏవైనా అరుదైన కూరగాయల రకాల విత్తనాలు ఉన్నాయా? అని అడుగుతాడు. తన దగ్గర ఉన్న దేశీయ విత్తనాలను తీసుకుని, గ్రామస్థుల వద్ద విత్తనాలు ఇమ్మని కోరుతాడు.

‘కాలేజీ రోజుల్లో నుంచే ఆసక్తి’
తాను సంప్రదాయ పంటలను పరిరక్షించడానికి గల కారణాలను మంజునాథ్ వివరించారు. తాను పీయూ కళాశాలలో పీజీ చదువుతున్నప్పుడు దివంగత వ్యవసాయ నిపుణులు ఎల్. నారాయణ రెడ్డి సేంద్రియ వ్యవసాయంపై ఇచ్చిన ఉపన్యాసాన్ని విన్నానని చెప్పారు. ఆ స్పీచ్ తనపై చెరగని ముద్ర వేసిందని వెల్లడించారు. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యానికి గురైందని అన్నారు. మనం తినే ఆహారం స్వచ్ఛంగా లేదని, కలుషితమైందని వైద్యులు తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ విషయమే తనను దేశీయ విత్తనాలపై దృష్టిసారించేలా ప్రేరేపించిందని స్పష్టం చేశారు.

వాణిజ్య వ్యవసాయం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని మంజునాథ్ అన్నారు. దేశీయ విత్తనాలతో సేంద్రీయంగా పండించిన ఆహారాన్ని తినాలని, ఈ విత్తనాల పంపిణీ నుంచి తాను ఎలాంటి ఆదాయాన్ని ఆశించడం లేదని తెలిపారు. అయితే విత్తనాలకు కొంత విలువ ఉండాలని తాను భావిస్తున్నారని చెప్పారు. అందుకే వాటిని భవిష్యత్తులో పూర్తిగా ఉచితంగా ఇవ్వకుండా నామమాత్రపు ధరకు అందిస్తారని అన్నారు. మంజునాథ్ నుంచి దేశీయ విత్తనాలు పొందిన బెళగావికి చెందిన విజయ ఎమ్మి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆరు నెలల క్రితం మంజునాథ్‌ను కలిశానని చెప్పారు. తనకు గుమ్మడి, బీన్స్ సహా తొమ్మిది రకాల విత్తనాలను ఆయన ఇచ్చారని అన్నారు. వాటిని తన పెరట్లో నాటానని, అవి ఇప్పుడు మొలకెత్తాయని స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు చేయాల్సిన పనిని మంజునాథ్ చేస్తున్నారని, దేశీయ విత్తనాలను పరిరక్షించడానికి ఆయన చేస్తున్న సేవ ప్రశంసనీయమని కొనియాడారు.