News

సేవా భారతి సేవా కార్యక్రమాలపై కేరళ సర్కార్ అక్కసు

28views

కేరళ ఆరోగ్య మంత్రి మురళీధరన్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు చేసే ఆహార పంపిణీ వల్ల, ఇతరత్రా సేవల వల్ల ఆస్పత్రుల నిర్వాహణకు తీవ్ర ఆటంకం కలుగుతోందని వింత వ్యాఖ్యలు చేశారు.

వివిధ మెడికల్ కాలేజీలు, జిల్లా జనరల్ ఆసుపత్రుల్లో ‘సేవాభారతి’ ద్వారా జరుగుతున్న ఆహార సేవా కార్యక్రమాలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో ఇస్కాన్ (ISKCON), డివైఎఫ్ఐ (DYFI) సంస్థలు కూడా ఇదే ఉచిత ఆహార సేవలను అందిస్తున్నాయి. ఏ సంస్థ జెండాలు, బ్యానర్ల కింద ఆహారాన్ని పంపిణీ చేయడాన్ని ప్రభుత్వం అనుమతించదని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని నిలిపివేస్తామని మంత్రి అన్నారు. ‘కపట వేషధారణ’తో జరిపే ఆహార సరఫరాను సహించేది లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో అధికార పీఠం మంత్రిదే తప్ప సేవాభారతిది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఆసుపత్రుల్లో పారదర్శకత, క్రమశిక్షణ తీసుకురావడానికి ఆరోగ్య శాఖ ‘కమ్యూనిటీ కిచెన్’ (సముదాయ వంటగది) విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రయోగాత్మకంగా దీనిని అలప్పుళ మెడికల్ కాలేజీలో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

అయితే, మురళీధరన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలు స్వచ్ఛంద సంస్థల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాల నుంచే కాకుండా ఆయన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన మాట మార్చారు. ప్రభుత్వం ఎవరి ఆహార సరఫరాను నిలిపివేయడం లేదని, కేవలం ఆసుపత్రి స్థలాల అక్రమ ఆక్రమణలను, ఫ్లాట్‌ఫామ్‌లపై ఉండే ఆహార వ్యాపారులను మాత్రమే ఖాళీ చేయించామని వివరణ ఇచ్చారు. ఆ చర్యలను ఆహార పంపిణీని నిలిపివేస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ, రోగులకు ఆహార సరఫరా మాత్రం ‘కమ్యూనిటీ కిచెన్’ ద్వారానే జరగాలని ఆయన పట్టుబట్టారు. ఇదిలా ఉండగా, ఆసుపత్రి అధికారులు మాత్రం ఇప్పటికీ ఆహార ప్యాకెట్ల పంపిణీని అడ్డుకుంటున్నట్లు సమాచారం.

గత కొన్ని దశాబ్దాలుగా సేవాభారతి సంస్థ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో, అన్ని జిల్లాల్లోని తాలూకా ఆసుపత్రులలో రోగులకు, వారి సహాయకులకు (bystanders) ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్, తిరువనంతపురం మెడికల్ కాలేజ్, తిరువనంతపురం ఫోర్ట్ హాస్పిటల్, తిరువనంతపురం తైకాడ్ హాస్పిటల్, అలప్పుళ మెడికల్ కాలేజ్, కొట్టాయం మెడికల్ కాలేజ్, కోజికోడ్ మెడికల్ కాలేజ్, వయనాడ్ మెడికల్ కాలేజీలు ఈ జాబితాలో వున్నాయి.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సేవాభారతి ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దాదాపు 50కి పైగా కేంద్రాల్లో ఈ కార్యకలాపాలు సాగుతున్నాయి.ప్రభుత్వ వ్యవస్థ రోగులకు భోజనం పెడుతోందని మంత్రి చెప్తున్నారు; కానీ ‘మరి రోగుల సహాయకులకు ఆహారం ఎవరు పెడతారు?’ అనే ప్రశ్న ఉద్భవిస్తోంది. సాధారణంగా పేద ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం, సదుపాయాల కోసం వస్తుంటారు. సహజంగానే వారి సహాయకులు కూడా అదే పేద వర్గానికి చెందినవారై ఉంటారు. వారూ మనుషులే, వారికి కూడా ఆహారం అవసరం. ఇక్కడే ఎన్జీవోలు చేసే ఆహార పంపిణీ యొక్క ప్రాముఖ్యత స్పష్టమవుతోంది.

తిరువనంతపురంలో సేవాభారతి ‘అనంతశాయి’ పేరిట 8 నుండి 10 గదులు ఉన్న ఒక సంస్థను నడుపుతోంది. వైద్యం కోసం తిరువనంతపురం వచ్చే రోగులకు, వారి సహాయకులకు ఇది వసతి కల్పిస్తుంది. అంతేకాకుండా, తిరువనంతపురంలోని ఆసుపత్రుల్లో ఆహార పంపిణీలో పాల్గొనే సేవాభారతి కార్యకర్తలు.. పండుగ సమయంలో ఇళ్లకు వెళ్లలేని వైద్యులు, నర్సుల కోసం ప్రతి ఓణం పండుగకు ‘ఓణ సద్య’ (సంప్రదాయ ఓణం విందు)ను కూడా ఏర్పాటు చేస్తారు.

మంత్రి ప్రకటనపై రోగులు, వారి సహాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు వారి అభిప్రాయాలు కోరినప్పుడు, వారు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “సేవాభారతికి బదులుగా ప్రభుత్వమే మాకు అన్నం పెడుతుందా?” అని ఆగ్రహంతో ప్రశ్నించారు.