News

నేపాల్‌ రూపాయి నాణెంలో భారత్‌ భూభాగాల తొలగింపు

30views

భారత్‌తో సరిహద్దు వివాదానికి కేంద్రంగా ఉన్న లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను చూపే రాజకీయ మ్యాప్‌ను నేపాల్‌ తన కొత్త ఒక రూపాయి నాణెం నుంచి తొలగించనుంది. ఆ స్థానంలో ముస్తాంగ్‌ జిల్లాలోని మరాంగ్‌ గ్రామంలో ఉన్న చారిత్రక లో గ్యాకర్‌ (ఘర్‌) బౌద్ధ మఠం చిత్రాన్ని ముద్రించాలని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త నమూనా నాణేలను ముద్రించాలని నేపాల్‌ రాష్ట్రీయ బ్యాంకుకు అనుమతి ఇచ్చింది.

2020లో అప్పటి ప్రధానమంత్రి కె.పీ. శర్మ ఒలీ ప్రభుత్వం లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను నేపాల్‌ అధికారిక మ్యాప్‌లో చేర్చిన తర్వాత అదే మ్యాప్‌ను ఒక రూపాయి నాణెంపై ముద్రించింది. ఈ మూడు ప్రాంతాలు తమ భూభాగమేనని నేపాల్‌ చెబుతుండగా, అవి భారత భూభాగంలో భాగమేనని భారత్‌ స్పష్టం చేస్తోంది.

అయితే, రెండు రూపాయల నాణెంపై ప్రస్తుతం ఉన్న మ్యాప్‌లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త నాణేలు పరిమాణంలో చిన్నవిగా, బరువులో తక్కువగా ఉండటంతో పాటు ఉక్కుతో తయారు చేయనున్నట్లు నేపాల్‌ రాష్ట్రీయ బ్యాంకు వెల్లడించింది.