ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్‌గా వివిధ దేశాల్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఔషధ మొక్కల సాగులో విజయవంతంగా రాణిస్తున్నారు బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి. ప్రకృతిని పరిరక్షించాలనే సంకల్పంతో పాటు, అంతరించిపోతున్న ఔషధ మొక్కలను కాపాడాలనే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ప్రయాణం ఇప్పుడు రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. మూడు ఎకరాల్లో మొదలైన ఈ ప్రయత్నం ప్రస్తుతం 12 ఎకరాలకు విస్తరించగా, దేశం నలుమూలల నుంచి రైతులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ కేంద్రాన్ని సందర్శిస్తున్నారు.
బిహార్‌లోని గయా జిల్లా మోహ్రా బ్లాక్ పరిధిలోని జేతియాన్ నయా నగర్‌కు చెందిన గోపాల్ శరణ్ విద్య పూర్తి చేసిన తర్వాత పలు దేశాల్లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల్లో మార్కెటింగ్, ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేశారు. ఉద్యోగరీత్యా కెనడాలో ఉన్న సమయంలో అక్కడి ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇచ్చే ప్రాధాన్యం ఆయనను ఆకట్టుకుంది. అక్కడి ‘యునైటెడ్ ప్లాంట్ సేవర్స్’ సంస్థ ద్వారా ఔషధ మొక్కల ప్రాముఖ్యత, వాటి పరిరక్షణపై అవగాహన పొందారు. భారతదేశంలో శతాబ్దాలుగా ఉన్న ఆయుర్వేద సంపద క్రమంగా కనుమరుగవుతుండటాన్ని గుర్తించిన ఆయన, స్వదేశానికి తిరిగి వచ్చి మూలికల సాగుకు అంకితమయ్యారు. అలా 2022లో అధికారికంగా ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు.
మూడు ఎకరాల్లో 400 రకాల ఔషధ మొక్కలు
ప్రస్తుతం గోపాల్ శరణ్ నిర్వహిస్తున్న ఔషధ తోట దాదాపు మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 400 రకాల ఔషధ మొక్కలు, సుమారు 2,200కు పైగా చెట్లు, మొక్కలు పెరుగుతున్నాయి. ఔషధ మొక్కలతో పాటు సుగంధ మొక్కలు, అరుదైన పండ్ల చెట్లు, విలువైన కలప జాతులను కూడా సాగు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో వివిధ జిల్లాల రైతులు ఈ తోటను సందర్శించి సాగు విధానాలను తెలుసుకుంటున్నారు. మొదట మూడు ఎకరాల్లో ప్రారంభమైన ఈ ప్రయోగాన్ని ఇప్పుడు 12 ఎకరాలకు విస్తరించే దిశగా గోపాల్ అడుగులు వేస్తున్నారు.
అంతరించిపోతున్న జాతుల పరిరక్షణే లక్ష్యం
‘సెంటర్ ఫర్ మెడిసినల్ ప్లాంట్ కన్జర్వేషన్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో కచ్నార్, నాగ్ కేసర్, అమల్తాస్, తెల్ల చందనం, ఎర్ర చందనం, గుగ్గుల్, చియా సీడ్, గుడ్మార్, హడ్జోడ్, తులసి ఏడు రకాలతో సహా వందలాది ఔషధ మొక్కలను పెంచుతున్నారు. బంగాల్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా అరుదైన జాతులను సేకరించినట్లు గోపాల్ తెలిపారు. ఆయుర్వేద, యునానీ, హోమియోపతి వైద్య విధానాల్లో ఉపయోగించే అనేక మొక్కలు ఈ కేంద్రంలో ఉన్నాయని చెప్పారు. ఈ తోటలోని ముఖ్యమైన మొక్కల్లో చియా విత్తనం ప్రత్యేకమైనది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండే చియా గింజలు గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు నిర్వహణకు ఉపయోగపడతాయని గోపాల్ వివరించారు. అలాగే కచ్నార్ మొక్క థైరాయిడ్ సమస్యలు, జీర్ణక్రియ, చర్మవ్యాధులు, వాపులు తగ్గించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెల్ల బన్సా మొక్కను ఆయుర్వేద, యునానీ వైద్యంలో దగ్గు నివారణకు విస్తృతంగా వినియోగిస్తారని తెలిపారు.
రైతులకు స్ఫూర్తిగా నలిచిన తోట
ఈ ఔషధ తోట ప్రస్తుతం రైతులతో పాటు ఆయుర్వేద, యునానీ నిపుణులు, ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థులు, పరిశోధకులను ఆకర్షిస్తోంది. బిహార్‌లోని పలు జిల్లాల రైతులు ఔషధ సాగుపై అవగాహన పొందేందుకు ఈ కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. ముజఫర్‌పుర్‌కు చెందిన రైతు అమోద్ కుమార్, బీహార్‌లో గోపాల్ వల్లె ఇంత పెద్ద ప్రైవేట్ ఔషధ మొక్కల సేకరణను మరెవరూ అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు.





