News

సరళా భట్ కేసు : కశ్మీర్ ‘రియల్’ ఫైల్స్ రీ ఓపెన్!

38views

కశ్మీర్ లోయ హింసతో రగిలిపోతున్న నాటి రోజుల్లో.. మానవత్వాన్ని మంటగలిపిన అత్యంత క్రూరమైన ఘటన 36 ఏళ్ల తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 1990లో యువ కశ్మీరీ పండిట్ నర్స్ సరళా భట్‌ను ఉగ్రవాదులు అపహరించి, సామూహిక అత్యాచారానికి గురిచేసి, చిత్రహింసలు పెట్టి పసిపిల్లల వార్డు నుంచి శవంగా మార్చిన వైనంపై జమ్ముకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్‌ఐఏ) కోర్టులో 737 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ ఘోరకలి వెనుక ఉన్న అసలు సూత్రధారి జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్ యాసిన్ మాలిక్ అని సంచలన ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థ రుజువు చేసింది. దశాబ్దాలుగా వెలుగుచూడని ఈ రక్తచరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలు..

లోయను వణకించిన కిరాతకం.. అసలు ఎవరీ సరళా భట్?
అనంతనాగ్ జిల్లా కాజీబాగ్‌కు చెందిన 27 ఏళ్ల సరళా భట్ శ్రీనగర్‌లోని షేర్ ఎ కశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌కేఐఎంఎస్‌) ఆస్పత్రిలోని నియోనాటాలజీ (పసిపిల్లల) విభాగంలో స్టాఫ్ నర్సుగా పనిచేసేవారు. 1990 కాలంలో కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. దీంతో పలువురు పండిట్లు లోయ వదిలి పారిపోతున్నా, ఆమె మాత్రం తన విధులకు కట్టుబడి ఆస్పత్రిలోనే ఉండిపోయారు. తనకు ఉగ్రవాద సంస్థల నుంచి నిరంతరం బెదిరింపులు వస్తున్నా, ప్రాణాలకు తెగించి పసిపిల్లల సేవలో నిమగ్నమయ్యారు. అయితే, ఆ సేవా గుణమే ఆమె ప్రాణాల మీదకు తెస్తుందని ఆమె ఊహించలేదు.

నడిరోడ్డుపై బుల్లెట్ల వర్షం.. అపహరణ నుండి శవం వరకు..
1990 ఏప్రిల్ 14న శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతంలో హబ్బా ఖాతూన్ హాస్టల్ నుండి జెకెఎల్ఎఫ్ ఉగ్రవాదులు సరళా భట్‌ను బలవంతంగా అపహరించారు. ఆ తర్వాత ఆమెను రహస్య ప్రాంతంలో బంధించి, కొన్ని రోజుల పాటు సామూహిక అత్యాచారానికి గురిచేశారు. అత్యంత అమానవీయంగా చిత్రహింసలు పెట్టారు. చివరకు ఏప్రిల్ 19న శ్రీనగర్‌లోని మాల్‌బాగ్ – ఒమర్ కాలనీ రోడ్డుపై ఆమెను ఆటోమేటిక్ రైఫిళ్లతో కాల్చి చంపి, రక్తం మడుగులో ఉన్న శవాన్ని నడిరోడ్డుపై పడేశారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమెపై జరిగిన దారుణమైన గ్యాంగ్‌రేప్, చిత్రహింసలు, బుల్లెట్ గాయాల తీవ్రత స్పష్టంగా బయటపడింది.

పండిట్ల సామూహిక వలసకు దారితీసిన కీలక మలుపు
సరళా భట్ దారుణ హత్య కశ్మీరీ పండిట్ల చరిత్రలో ఒక అత్యంత భయానకమైన ఘట్టం. ఆమెను చంపిన తర్వాత, ఉగ్రవాదులు ఆమె శరీరంపై ఒక నోట్ కూడా ఉంచారు. అందులో ఆమెను ఆర్మీ ఇన్‌ఫార్మర్‌గా చిత్రీకరిస్తూ అబద్ధాలు ప్రచారం చేశారు. కానీ దర్యాప్తులో అది కేవలం హత్యను సమర్థించుకోవడానికి ఉగ్రవాదులు ఆడిన నాటకమని తేలింది. శ్రీనగర్ నడిబొడ్డున పడి ఉన్న ఆమె శవాన్ని చూసిన తర్వాత, లోయలో బతకగలమనే కశ్మీరీ పండిట్ల ఆఖరి ఆశ కూడా ముక్కలైపోయింది. ఆ భయాందోళనల మధ్యే రాత్రికి రాత్రే లక్షలాది మంది పండిట్ కుటుంబాలు ఇళ్లను వదిలి జమ్మూ, ఢిల్లీ ప్రాంతాలకు వలస బాట పట్టాయి.

దశాబ్దాల పాటు కోల్డ్ స్టోరేజీలోనే ఫైళ్లు
ఈ ఘోరమైన ఉదంతంపై నాడు నిగీన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటికీ, అప్పటి పరిస్థితులు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. నాడు ఒక స్థానిక పత్రిక ఈ దారుణాన్ని కేవలం ఒకే ఒక్క లైన్ లో ‘లోయలో నర్సు కాల్చివేత’ అని ప్రచురించి వదిలేసింది. పండిట్లపై జరిగిన ఈ ఘోర అన్యాయం దశాబ్దాల పాటు మరుగున పడిపోయింది. బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా న్యాయం జరుగుతుందనే ఆశను పూర్తిగా వదిలేసుకున్నారు.

2025లో తిరగతోడిన కేసు.. ఎల్‌జీ మనోజ్ సిన్హా సంచలన నిర్ణయం
కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, జమ్మూ కశ్మీర్ పరిపాలనలో వచ్చిన మార్పుల వల్ల 2025 ఆగస్టు 1న లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్‌లో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 1990లలో కశ్మీరీ హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యల కేసులను మళ్లీ తిరగదోడాలని ఆయన ఆదేశించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2025 ఆగస్టు 12న శ్రీనగర్‌లోని 8 ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించి పాత ఫైళ్లు, సాక్ష్యాలను, ఆనాటి తోటి నర్సుల వాంగ్మూలాలను సేకరించింది.

ఛార్జ్‌షీట్‌లో యాసిన్ మాలిక్ పేరు.. 
ప్రస్తుతం తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జెకెఎల్ఎఫ్ అప్పటి కమాండర్ ఇన్ చీఫ్ యాసిన్ మాలిక్, ఈ దారుణ హత్యకు ప్రధాన సూత్రధారి అని ఎస్ఐఏ తన 737 పేజీల ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది. యాసిన్ మాలిక్‌తో పాటు ఖుర్షీద్ అహ్మద్ చల్కో, అబ్దుల్ హమీద్ షేక్, మహ్మద్ యూసుఫ్ సోఫీ, గులాం మహ్మద్ టప్లూ అనే ఐదుగురు ఉగ్రవాదులు ఈ కుట్రలో పాల్గొన్నట్లు శాస్త్రీయ  ఆధారాలతో నిరూపించింది. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులు ఇప్పటికే మరణించగా, కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు ఖుర్షీద్ అహ్మద్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌కి పారిపోయినట్లు గుర్తించారు. ఎట్టకేలకు 36 ఏళ్ల తర్వాత ఈ కేసు ముగింపునకు రావడం కశ్మీరీ పండిట్లలో న్యాయంపై కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.