News

గిరిజనులను బలవంతంగా మరొక మతానికి మార్చే హక్కు ఎవరికీ లేదు : అమిత్ షా

22views

ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) గిరిజనులను ఏ విధంగానూ ప్రభావితం చేయదని, వారికి ఎలాంటి నష్టం జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. కొందరు ఈ విషయంపై కుట్రలు పన్నుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారని, అటువంటి వదంతులను నమ్మవద్దని గిరిజన వర్గాన్ని ఆయన కోరారు. గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని దిల్లీలోని ఎర్రకోట మైదానంలో ఆరెస్సెస్‌ అనుబంధ ‘జనజాతి సురక్షా మంచ్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జనజాతి సాంస్కృతిక సమాగమం’ అనే సదస్సులో అమిత్‌ షా ప్రసంగించారు. ‘యూసీసీ అమలు చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల్లో గిరిజన వర్గాలను దాని పరిధి నుంచి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. గిరిజన వర్గాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం జీవించే హక్కును యూసీసీ హరించేస్తుందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గిరిజన వర్గాలు, ఆదివాసి సమాజంపై యూసీసీలోని ఏ నిబంధనను విధించబోం.గిరిజనులను బలవంతంగా మరొక మతానికి మార్చే హక్కు ఎవరికీ లేదు. గత ప్రభుత్వాలు గిరిజన సంక్షేమం కోసం రూ.28 వేల కోట్లు కేటాయిస్తే ప్రధాని మోదీ దాన్ని రూ.1.54 లక్షల కోట్లకు పెంచారు’ అని అమిత్‌ షా తెలిపారు.

ఇతర మతాల్లోకి మారిన గిరిజనులను ఎస్టీ కేటగిరీ నుంచి తొలగించాలంటూ ఈ సదస్సుకు హాజరైన గిరిజనులు డిమాండు చేశారు. అందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342ని సవరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి సుమారు 500 తెగలకు చెందిన 1.5 లక్షల గిరిజనులు తరలివచ్చారు. వారంతా తమ సంప్రదాయ వస్త్రధారణతో సందడి చేశారు. క్రైస్తవం, ఇస్లాం సహా ఇతర మతాలను స్వీకరించిన గిరిజనులు ఎస్టీ కేటగిరీ ప్రయోజనాలను అందుకోవడం తగదని, వారిని గిరిజనులుగా గుర్తించకూడదన్న డిమాండు 1960ల నుంచే ఉందని జనజాతి సురక్షా మంచ్‌ అస్సాం ప్రాంత్‌ ప్రతినిధి మాలయ జిగ్డుంగ్‌ చెప్పారు.