
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టులో భాగంగా మానవ రహిత రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు సిద్ధమవుతున్నామని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పరీక్షించిన 8వేలకు పైగా ప్రయోగాలు సఫలమయ్యాయని వెల్లడించారు.
విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యోమగాముల భద్రత దృష్ట్యా మూడు మానవ రహిత రాకెట్‌లను ప్రయోగిస్తున్నట్లు తెలిపారు. మొదటి ప్రయోగం మార్చిలో చేపట్టేందుకు శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారని వెల్లడించారు. రాకెట్‌లోని ప్రతి వ్యవస్థను పరిశీలిస్తున్నామని, గగన్‌యాన్ మిషన్ విజయవంతం చేయడమే అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. రెండో మానవ రహిత రాకెట్ ప్రయోగం ఈ ఏడాది చివరిలో ఉంటుందన్నారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు తుది దశకు చేరిందన్నారు.
మానవ సహిత స్పేస్ మిషన్‌లో భాగంగా మార్చిలో ‘వ్యోమమిత్ర’రోబోను పంపనున్నారు. 2027లో చేపట్టనున్న గగన్‌యాత్రకు వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికైన సంగతి తెలిసిందే.



