News

అంబరాన్నంటిన.. సిరిమాను శంబరం

238views

దారులన్నీ జనసంద్రమే.. ఎటు చూసినా కనుచూపు మేర ‘శంబర’మే. చల్లని తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. గిరిజనుల కొంగుబంగారం పోలమాంబ… వనాన్ని వీడి, జనంలోకి వచ్చింది. తన భక్తజనం జేజేలు చూసి మురిసింది. 30 అడుగుల సిరిమానుపై పూజారి రూపంలో ఠీవీగా ఆసీనులై, పురవీధుల్లో ఊరేగింది. చల్లని చూపుతో ఆశీర్వచనాలు అందజేసింది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా తిలకించిన భక్తకోటి ఆనందంతో పులకించిపోయింది.

ఉత్తరాంధ్రుల కల్పవల్లి, చల్లనితల్లి శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం పార్వతీపురంమన్యం జిల్లా మక్కువలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల విశ్వాసం చూరగొన్న పోలమాంబను చూసి తరించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు పొరుగున్న ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసిన పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలిరాగా.. భక్తులు జయజయధ్వానాల నడుమ శంబర గ్రామం పులకించింది.

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సిరిమానోత్సవాన్ని ప్రారంభించాలని భావించిన అధికారులు.. అనుకున్న సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా చేయలేకపోయారు. గ్రామపెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లోపించడంతో ఘటాలను తీసుకురావడంలో జాప్యమైంది. సాయంత్రం 4.20 నిమిషాలకు పూజారి జన్నిపేకాపు భాస్కరరావు అలియాస్‌ జగదీశ్వరరావు సిరిమానును అధిరోహించారు. దీంతో ఏటా నిర్వహించిన సమయం కంటే సుమారు గంట సమయం ఆలస్యంగా ఈ ఏడాది ఉత్సవం మొదలైంది. పురవీధుల్లో ఊరేగిన అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రధానాలయం సమీపంలోకి సిరిమాను చేరుకుంది.

ముందుగా జన్నివారి ఇంటి నుంచి ఘటాలను అమ్మవారి ఆలయంలోకి తీసుకొచ్చి, పూజలు నిర్వహించారు. అనంతరం సిరిమాను ఉండే ప్రదేశానికి తీసుకువచ్చారు. ప్రధానాలయం నుంచి అమ్మవారు వచ్చే మార్గంలో నేలపై చీరలను పరిచి.. వాటిపై చిన్నారులను పడుకోబెట్టారు. వారిపై అమ్మవారి ఘటాలు దాటుతూ వెళ్లడంతో భక్తులు పులకించిపోయారు. జన్నివారి ఇంటి నుంచి అమ్మవారి ఘటాలను గిరడ వారింటికి, ఆ తర్వాత మునసబు, కరణం ఇళ్లకు తీసుకువెళ్లి పూజలు జరిపించారు. రాత్రంతా అమ్మవారి ఘటాలు గ్రామంలో తిరువీధి చేసి, బుధవారం ఉదయం 10 గంటల సమయానికి ప్రధాన రహదారి వద్ద అమ్మవారి గద్దెకు చేరుకుంటాయి. ఆ ప్రదేశంలో అమ్మవారి ఘటాలకు ఉయ్యాల కంబాల కార్యక్రమం నిర్వహించి, అనుపోత్సవంలో భాగంగా అమ్మవారి ఘటాలను వనంగుడికి తీసుకువెళ్తారు.

పోలమాంబ అమ్మవారికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతించి, ప్రత్యేక పూజలు జరిపించారు.

పులకించిన భక్త జనం
ఉత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రంలోని నలుమూలలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గతేడాది కంటే.. ఈ సారి అధికారుల అంచనాలను మించి భక్తుల తాకిడి పెరిగింది. 10 వారాల వరకు అమ్మవారి జాతర జరగనున్నప్పటికీ.. ఉచిత బస్సు కారణంతో తొలివారం బాగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారు జాము నుంచి ఉదయం 9.30 గంటల వరకు భక్తుల తాకిడి తక్కువగా కనిపించింది. తర్వాత ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో శంబర గ్రామం కిటకిటలాడింది. గ్రామంలోని రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రం కనిపించింది.